- ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత జరగలే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్ కు సంబంధించి మక్కల కొనుగోళ్లు రికార్డు స్థాయికి చేరాయి. గత పదేండ్లలోనే కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఇంత భారీగా మక్కలను ప్రభుత్వం సేకరించిన దాఖలాలు లేవని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మక్కల కొనుగోలులో ఇప్పటివరకు 2019-–20 యాసంగి సీజన్ దే రికార్డు. ఆ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 9.50 లక్షల టన్నులు కొన్నారు. ఈసారి ఇప్పటికే 14.37 లక్షల టన్నుల మక్కలను రాష్ట్ర సర్కారు మార్క్‌ఫెడ్ ద్వారా సేకరించింది. కొనుగోళ్లు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
12.94 లక్షల ఎకరాల్లో సాగు
ఈ ఏడాది రాష్ట్రంలో రైతులు రికార్డు స్థాయిలో 12.94 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. అనుకూల వాతావరణ పరిస్థితులు, మంచి దిగుబడులు రావడంతో మొత్తం ఉత్పత్తి 39 లక్షల టన్నులకు చేరుకునే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రధానంగా సిద్దిపేట, నాగర్‌కర్నూల్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, భూపాలపల్లి, హనుమకొండ, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో పంట అధిక విస్తీర్ణంలో సాగైంది.
334 కొనుగోలు కేంద్రాలు
మార్కెట్లకు పెద్ద ఎత్తున మక్కలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లను వేగవంతం చేసింది. కేంద్ర ప్రభుత్వం మక్కల సేకరణకు అనుమతించనప్పటికీ కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,400తో సేకరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో 334 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మక్కల కొనుగోలు కోసం మార్క్‌ఫెడ్ రూ.6 వేల కోట్లు సిద్ధం చేసింది. కాగా, ఇప్పటికే 2.64 లక్షల మంది రైతుల వద్ద నుంచి రూ.4,200 కోట్ల విలువైన మక్కలను సేకరించింది.
