రిజిస్ట్రేషన్ల ధమాకా!.. మే నెలలో ఏకంగా రూ.1,700 కోట్ల రాబడి

రిజిస్ట్రేషన్ల ధమాకా!.. మే నెలలో ఏకంగా రూ.1,700 కోట్ల రాబడి
  • ఒక్క నెలలోనే 1.70 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్
  • ఏప్రిల్, మే రెండు కలిపితే రూ.3,110 కోట్ల ఆదాయం
  • మార్కెట్ విలువ పెరుగుతుందనే ముందస్తు అంచనాలతో పెరిగిన రద్దీ

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. గడిచిన మే నెలలో రిజిస్ట్రేషన్ల శాఖకు రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. మార్కెట్ విలువలు పెరగవచ్చనే ముందస్తు అంచనాలతో కొనుగోలుదారులు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లకు మొగ్గు చూపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం మే నెలలోనే ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.1,700 కోట్ల రాబడి రావడం విశేషం. సాధారణంగా వచ్చే సగటు ఆదాయం కంటే ఇది రూ.500 కోట్లు అదనం కావడం గమనార్హం. రాబోయే రోజుల్లో భూముల మార్కెట్ విలువ పెరగనుందనే ముందస్తు సమాచారంతో కొనుగోలుదారులు, రియల్టర్లు భారీగా రిజిస్ట్రేషన్ల వైపు మొగ్గు చూపారు. ఈ ఒక్క నెలలోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.70 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏప్రిల్ నెలలో నమోదైన రూ.1,410 కోట్ల రాబడితో పోలిస్తే మే నెలలో వృద్ధి రేటు స్పష్టంగా కనిపిస్తోంది. రియల్ మార్కెట్ మందగించిందనే అంచనాలను తలకిందులు చేస్తూ ఈ స్థాయిలో ఆదాయం రావడం గమనార్హం. 

గతంతో పోలిస్తే ఈసారి టాప్​

గడిచిన రెండేండ్ల మే నెలల ఆదాయ గణాంకాలను పరిశీలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన వృద్ధి స్పష్టంగా అర్థమవుతుంది. గత 2024-–25 ఆర్థిక సంవత్సరం మే నెలలో ప్రభుత్వానికి కేవలం రూ.1,079 కోట్ల ఆదాయం మాత్రమే లభించింది. ఆ తర్వాత 2025–-26 ఆర్థిక సంవత్సరం మే నెల నాటికి ఈ రాబడి కొంత మేర వృద్ధి చెంది రూ.1,390 కోట్లకు చేరుకుంది. అయితే, ప్రస్తుత 2026-–27 ఆర్థిక సంవత్సరం మే నెలలో ఏకంగా రూ.1,700 కోట్లు రావడం రిజిస్ట్రేషన్ల శాఖ చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డుగా నిలిచింది. గతేడాది మే నెలతో పోల్చితే ఈసారి సుమారు రూ.310 కోట్లు అదనంగా రావడం విశేషం. భూముల విలువలు త్వరలోనే సవరించబోతున్నారనే ప్రచారంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు జనంతో కిక్కిరిసిపోయాయి. పెరగబోయే అదనపు భారం నుంచి తప్పించుకునేందుకు సామాన్యుల నుంచి బడా వ్యాపారుల వరకు అంతా ముందస్తుగానే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్నారు. గత 2024–-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో రాష్ట్రానికి రూ.1,115 కోట్ల ఆదాయం సమకూరింది. ఆ తర్వాతి సంవత్సరం, అంటే 2025-–26 ఏప్రిల్ నెలలోనూ సరిగ్గా అదే స్థాయిలో రూ.1,115 కోట్ల రాబడి కొనసాగడం గమనార్హం. అయితే ప్రస్తుత 2026–-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెల నాటికి ఈ మార్కెట్ ఊపందుకుని ఆదాయం రూ.1,410 కోట్లకు చేరింది. అంటే గతేడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఈసారి రూ.295 కోట్ల మేర అదనపు రాబడి ప్రభుత్వానికి దక్కింది. ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే ఈ తరహా పాజిటివ్ ట్రెండ్ కొనసాగడం, ఆపై మే నెలలో అది మరింత పుంజుకుని రూ.1,700 కోట్లకు చేరడం రియల్ రంగ బూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఊతం ఇస్తుందని చెబుతున్నారు.

మార్కెట్​ వ్యాల్యూ పెరిగి రియల్​ బూమ్​ వస్తే టార్గెట్​ రీచ్..​

రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాలు, ఐటీ కారిడార్లు, మున్సిపాలిటీల పరిధిలో భూములు, ప్లాట్లు, ఫ్లాట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. సాధారణంగా వేసవి కాలంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కాస్త మందకొడిగా సాగుతుంటుంది, కానీ ఈసారి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. మార్కెట్ వాల్యూ సవరణపై వస్తున్న లీకుల నేపథ్యంలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. మే నెలలో ఏకంగా 1.70 లక్షల డాక్యుమెంట్లు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ద్వారా ప్రాసెస్ అయ్యాయంటే ఏ స్థాయి రద్దీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏటా సగటున వచ్చే రాబడి కంటే దాదాపు రూ.500 కోట్లు అదనంగా రావడం పట్ల ఆర్థిక శాఖ సైతం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇదే జోరు గనుక మున్ముందు కూడా కొనసాగితే, మార్కెట్​ వాల్యూ పెంచితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ నిర్దేశించుకున్న రూ.19,540 కోట్ల వార్షిక లక్ష్యాన్ని సులువుగా అధిగమించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అదనపు పనివేళలు

రిజిస్ట్రేషన్ల కోసం ఒక్కసారిగా దరఖాస్తులు వెల్లువెత్తడంతో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై తీవ్ర పనిభారం పడింది. టోకెన్ల సంఖ్య అమాంతం పెరిగిపోవడంతో పెండింగ్ డాక్యుమెంట్లు పేరుకుపోకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే సిబ్బంది సాధారణ పనివేళల కంటే అదనంగా శ్రమించాల్సి వచ్చింది. ఉదయం నిర్ణీత సమయం కంటే ముందే కార్యాలయాలను ప్రారంభించడంతో పాటు, రాత్రి వేళల్లో సైతం ఆలస్యంగా విధులు నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గత నెల 29వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ బుధవారం వరకు పని వేళలను ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు పొడిగించారు.