సర్పంచ్లకు 5 నెలల గౌరవ వేతనం రిలీజ్.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.32,500 జమ

సర్పంచ్లకు 5 నెలల గౌరవ వేతనం రిలీజ్..  ఒక్కొక్కరి ఖాతాలో  రూ.32,500 జమ
  • సర్పంచ్​లకు 5 నెలల గౌరవ వేతనం రిలీజ్​
  • ఒక్కొక్కరి ఖాతాలో రూ.32,500 జమ
  •     రాష్ట్రవ్యాప్తంగా 12,702 మంది సర్పంచులకు లబ్ధి
  •     రూ.209 కోట్లపైగా విడుదల చేసిన ప్రభుత్వం

రాష్ట్రంలోని సర్పంచ్​లకు ఐదు నెలలుగా పెండింగ్‌‌లో ఉన్న గౌరవ వేతనాలను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. ఒక్కొక్కరి ఖాతాలో రూ.32,500 జమ కానున్నాయి. 12,702 మంది సర్పంచులకు లబ్ధి చేకూరనుంది.


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్పంచ్​లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఐదు నెలలుగా పెండింగ్‌‌లో ఉన్న గౌరవ వేతనాలను ఒకేసారి విడుదల చేసింది. ఈ మేరకు నేరుగా సర్పంచుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నది. ప్రస్తుతం సర్పంచులకు ప్రతి నెలా రూ.6,500 గౌరవ వేతనాన్ని ప్రభుత్వం చెల్లిస్తున్నది. గత ఐదు నెలలుగా ఈ వేతనాలు అందకపోవడంతో సర్పంచులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు 5 నెలల పెండింగ్ జీతాలను కలిపి ఒక్కో సర్పంచుకు రూ.32,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఖాతాల్లో జమ చేయనుంది. 


మల్టీ పర్పస్ వర్కర్లకు మే నెల వేతనాలు రూ.45.70 కోట్లు విడుదల


రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్లకు (ఎంపీడబ్ల్యూ) ప్రభుత్వం మే నెల వేతనాలను విడుదల చేసింది. ఇందుకు సంబంధించి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 49,663 మంది వర్కర్ల జీతాల కోసం మొత్తం రూ. 45.70 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులను 25 జిల్లాలకు కేటాయించారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 3,259 మంది వర్కర్లకు రూ.2.92 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో 2,907 మందికి రూ.2.68 కోట్లు, నిజామాబాద్ జిల్లాలో 2,721 మందికి రూ.2.51 కోట్లు విడుదలయ్యాయి. అతి తక్కువగా ములుగు జిల్లాలో 762 మంది వర్కర్ల కోసం రూ.64 లక్షలు కేటాయించారు. మంజూరైన నిధులను తక్షణమే సంబంధిత గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ -పంచాయతీ పోర్టల్‌‌లో నమోదైన పేర్ల ఆధారంగానే పంచాయతీ కార్యదర్శులు చెక్కులు జారీ చేయాలని, జూన్ 7వ తేదీలోపు పేమెంట్ వివరాలను పోర్టల్‌‌లో అప్‌‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు. వేతనాల చెల్లింపు ప్రక్రియను జిల్లా పంచాయతీ అధికారులు పర్యవేక్షించి, నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రతి నెలా రూ.40 కోట్లకు పైనే


రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,702 మంది సర్పంచులు ఉండగా వీరందరికీ గౌరవ వేతనాల రూపంలో ప్రభుత్వం ప్రతి నెలా రూ.41.28 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఐదు నెలలుగా చెల్లించకపోవడంతో బకాయిలు రూ.209 కోట్లకు పైగా పేరుకుపోయాయి. ప్రస్తుతం ఈ మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. పెండింగ్ వేతనాలు ఒకేసారి అకౌంట్లలో జమ కావడంతో సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.