- 24 జిల్లాల్లో 42 డిగ్రీలు దాటిన టెంపరేచర్
- మిగతా జిల్లాల్లోనూ 41 డిగ్రీలకుపైగా నమోదు.. హైదరాబాద్‌లో తొలిసారి 40 డిగ్రీల మార్క్
- మల్కాజ్‌గిరిలో 41.9 డిగ్రీల మేర రికార్డ్.. సిటీవ్యాప్తంగా హీట్‌వేవ్స్
- రాష్ట్రానికి వారం రోజులపాటు హీట్‌వేవ్స్ అలర్ట్.. 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నయ్. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రమవుతోంది. మంగళవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రమంతటా 41 డిలగ్రీలకుపైగా టెంపరేచర్లు నమోదయ్యాయి. హీట్‌వేవ్స్ పరిస్థితులున్నాయి. మంగళవారం మంగళవారం 24 జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా నమోదైతే.. అందులో ఆరు జిల్లాల్లో 43 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరో 19 జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా ఘనపూర్‌లో 43.5 డిగ్రీలు నమోదైంది. జగిత్యాల జిల్లా కథలాపూర్‌లో 43.4 డిగ్రీలు, నిర్మల్ జిల్లాలో 43.3, నిజామాబాద్ జిల్లా మాచర్లలో 43.3, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 43.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
కామారెడ్డి, గద్వాల, ములుగు, కుమ్రంభీం ఆసిఫాబాద్, మెదక్, నాగర్‌కర్నూల్, సిద్దిపేట, సూర్యాపేట, సిరిసిల్ల, కొత్తగూడెం, కరీంనగర్, సంగారెడ్డి, వనపర్తి, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా అన్ని జిల్లాల్లోనూ 41 డిగ్రీల నుంచి 41.9 డిగ్రీల మధ్య టెంపరేచర్లు నమోదయ్యాయి. హైదరాబాద్ సిటీలో ఉష్ణోగ్రతలు తొలిసారి 40 డిగ్రీల మార్క్‌ను అందుకున్నాయి. రెండ్రోజుల కిందటిదాకా 39 డిగ్రీల వద్దే టెంపరేచర్లుండగా.. మంగళవారం ఒక్కసారిగా రెండు డిగ్రీలు ఎక్కువ నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో 41.9 డిగ్రీలు, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 41.6, బేగంబజార్‌లో 41 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హయత్‌నగర్‌లో 41, సంతోష్‌నగర్40.9, బేగంపేటలో 40.9, షేక్‌పేటలో 40.8, ఆర్‌సీ పురంలో 40.8, సూర్‌నగర్‌లో 40.7, ఉప్పల్‌లో 40.5, కూకట్‌పల్లిలో 40.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జరపైలం.. హీట్‌వేవ్స్ ముప్పు..
వాస్తవానికి రాష్ట్రానికి హీట్‌వేవ్స్ ముప్పు లేదని ఐఎండీ 10 రోజుల క్రితం ఇచ్చిన ఔట్‌లుక్‌లో వెల్లడించింది. అయితే, పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నది. ఉత్తరాది రాష్ట్రాలు, పశ్చిమ రాష్ట్రాల నుంచి తెలంగాణ మీదకు వీస్తున్న తీవ్రమైన వేడిగాలుల ప్రభావంతో రాష్ట్రంలో టెంపరేచర్లు పెరుగుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరో వారం రోజుల పాటు వెదర్ ఇలాగే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని వార్నింగ్స్ ఇస్తున్నారు. బుధవారం నుంచి రెండ్రోజుల పాటు ఉత్తరాది జిల్లాల్లో వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని, ఆ తర్వాత అది దక్షిణాది జిల్లాలతో పాటు రాష్ట్రమంతటికీ విస్తరించే ముప్పు ఉందని హెచ్చరించారు. ఈ టైంలోనే టెంపరేచర్లు గరిష్ఠంగా 45 డిగ్రీల మార్క్‌నూ టచ్ అయ్యే అవకాశాలూ లేకపోలేదని చెప్తున్నారు. హైదరాబాద్ సిటీ పరిధిలోనూ 41 డిగ్రీలకుపైగానే టెంపరేచర్లు నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అలర్ట్ ఇచ్చారు.

