ఉగాది రోజున గద్దర్ అవార్డులు : డిప్యూటీ సీఎం భట్టి

ఉగాది రోజున గద్దర్ అవార్డులు : డిప్యూటీ సీఎం భట్టి
  •     ఈ నెల 6 నుంచి సినిమాల స్ర్కీనింగ్ స్టార్ట్: డిప్యూటీ సీఎం భట్టి
  •     కళల కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి గద్దర్‌‌‌‌‌‌‌‌ అని కామెంట్‌‌‌‌
  •     గద్దర్ ఫిలిం అవార్డ్స్ జ్యూరీ సభ్యులతో మీటింగ్

హైదరాబాద్, వెలుగు: ఈ నెల19న ఉగాది పండుగ రోజున గద్దర్ అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ నెల 6 నుంచే గద్దర్ సినిమా అవార్డుల స్క్రీనింగ్ ప్రారంభమవుతుందన్నారు. గతేడాది గద్దర్ అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని గొప్ప సందేశం ఇచ్చేలా నిర్వహించామని, ఈ సంవత్సరం కూడా అదే రీతిలో ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. అందుకు ఫిలిం డెవలప్‌‌‌‌మెంట్ కార్పొరేషన్, సమాచార శాఖలకు  పూర్తి సహకారం అందిస్తామన్నారు. 

బుధవారం సెక్రటేరియట్‌‌‌‌లో గద్దర్ సినిమా అవార్డుల జ్యూరీ సభ్యుల సమావేశంలో భట్టి విక్రమార్క  మాట్లాడారు. గద్దర్ అవార్డులకు ఎంపిక చేసే సినిమాలో కమర్షియల్ అంశంతో పాటు సామాజిక సందేశం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలని జ్యూరీ సభ్యులను కోరారు. దేశవ్యాప్తంగా ఫిలిం ఇండస్ట్రీకి హైదరాబాద్‌‌‌‌ను కేంద్రంగా చేయాలన్న ఆలోచనతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. సినీ ఇండస్ట్రీకి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 

ప్రపంచ సినీ మార్కెట్‌‌‌‌గా హైదరాబాద్‌‌‌‌

ముంబై, కోత్‌‌‌‌కతా, చెన్నై వంటి సిటీల్లో సినీ ఇండస్ట్రీ పెరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, దేశంలోని అన్ని భాషల ఇండస్ట్రీలను హైదరాబాద్‌‌‌‌లో విస్తరించే అవకాశాలు అనేకం ఉన్నాయని డిప్యూటీ సీఎం తెలిపారు. అన్ని భాషల సినీ ఇండస్ట్రీలు, హైదరాబాద్‌‌‌‌కు తరలి వస్తే రాష్ట్ర యువత, టెక్నీషియన్లు, రైటర్లు, డైరెక్టర్లు ఎంతోమందికి ఉపాధి లభిస్తుందన్నారు. దాంతో సినీ ప్రపంచ మార్కెట్‌‌‌‌కు హైదరాబాద్ కేంద్రంగా మారుతుందన్నారు. ఇందుకు సంబంధించిన బ్లూ ప్రింట్ ప్రభుత్వం తయారు చేస్తోందని చెప్పారు. 

గత ప్రభుత్వం పదేండ్లపాటు సినిమా రంగ అవార్డులను నిర్లక్ష్యం చేసిందన్నారు. సమాజం కోసం కళల ద్వారా తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానుభావుడు గద్దర్ అని భట్టి కొనియాడారు. సమావేశంలో ఎఫ్‌‌‌‌డీసీ చైర్మన్ దిల్ రాజు, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, జ్యూరీ సభ్యులు తనికెళ్ల భరణి, కేఎస్ రామారావు, రోజా రమణి, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు