అగ్రికల్చర్ మార్కెట్ల డిజిటలైజేషన్‌‌ను స్పీడప్ చేయాలి..అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం

అగ్రికల్చర్ మార్కెట్ల డిజిటలైజేషన్‌‌ను స్పీడప్ చేయాలి..అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
  • మార్కెటింగ్ శాఖలో పారదర్శకత పెంచాలి
  • సెక్రటేరియెట్‌‌లో అధికారులతో రివ్యూ మీటింగ్

హైదరాబాద్, వెలుగు : అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖను పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేసి మరింత పారదర్శకంగా తీర్చిదిద్దాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శనివారం ఆయన సెక్రటేరియెట్‌‌లో మార్కెటింగ్ శాఖ పనితీరు, అభివృద్ధి పనులు, పత్తి కొనుగోళ్లు, సోలార్ వ్యవస్థల ఏర్పాటుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 206 మార్కెట్ కమిటీలను పూర్తి స్థాయిలో ఆటోమేషన్ చేయాలని.. ఈ నెలాఖరులోగా టెండర్లు పూర్తి చేసి సెప్టెంబర్ నుంచి అమలు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.

ప్రతి మార్కెట్‌‌లో సీసీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషీన్లు, గేట్ ఎంట్రీ-ఎగ్జిట్ వ్యవస్థలను ఒకే డిజిటల్ ప్లాట్‌‌ఫారమ్‌‌కు అనుసంధానించాలని చెప్పారు. రవాణా శాఖ తరహాలో నంబర్ ప్లేట్ స్కానింగ్ విధానాన్ని తెచ్చి, వాహనాల రాకపోకలు, తూకాలు, లావాదేవీలన్నీ డిజిటల్‌‌గా నమోదయ్యేలా సాఫ్ట్‌‌వేర్ అభివృద్ధి చేయాలన్నారు. ప్రత్యేక తనిఖీ బృందాల నివేదికలను సోమవారంలోగా సమర్పించాలని, వాటి ఆధారంగా అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీజన్‌‌కు ముందుగానే పత్తి కొనుగోళ్లకు సన్నద్ధం కావాలని, సీసీఐ, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలతో ఆగస్టు మొదటి, రెండో వారంలో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.

అన్ని ఇంజినీరింగ్ పనులు గడువులోగా పూర్తిచేయాలి

మార్కెటింగ్ శాఖలో కొనసాగుతున్న అన్ని ఇంజినీరింగ్ పనులకు నిర్దిష్ట గడువులు నిర్ణయించి పూర్తి చేయాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. అవసరమైతే ఆర్‌‌అండ్‌‌బీ లేదా పంచాయతీరాజ్ శాఖలకు అప్పగించాలని సూచించారు. అన్ని మార్కెట్ యార్డులు, గోదాముల్లో సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని, కోహెడ ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ డిజైన్లను వచ్చే వారంలోగా ఖరారు చేసి త్వరలో పనులు ప్రారంభించాలని చెప్పారు.

ఆయిల్ పామ్ రైతుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఆయిల్ పామ్  రైతుల ఆదాయం పెంపే ప్రభుత్వ లక్ష్యమని, నాణ్యమైన మొక్కలను రైతులు కోరిన వెంటనే అందుబాటులో ఉంచేలా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.