ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

ఆగస్టు మొదటి వారంలో  అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు
  • 21 ఏండ్లకే చట్టసభలకు పోటీపై తీర్మానం!

హైదరాబాద్, వెలుగు: ఆగస్టు 5 లేదా 6 తేదీల్లో ఏదో ఒకరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం రేవంత్​రెడ్డి ఇటీవల ప్రకటించినట్లు.. చట్టసభలకు పోటీచేసేందుకు అర్హత వయస్సును 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించనున్నారు. ఒక రోజుతోనే సమావేశాన్ని ముగించనుండగా,  వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలో విద్యార్థుల నిరసనకు సంఘీభావంగా ఇటీవల విద్యార్థులతో కలిసి క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి..ఆ సందర్భంలో చేసిన ప్రకటన మేరకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. 

అసెంబ్లీలో ఓ వైపు సెంట్రల్ హాల్ నిర్మాణ పనులు సాగుతున్నప్పటికీ..  ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సీఎం ఈ అత్యవసర ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.  ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్.. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్ శాసన సభ, శాసన మండలి కార్యదర్శులు తిరుపతి, నర్సింహాచార్యులను ఆదేశించారు. దీంతో సోమవారం అసెంబ్లీలో ఉభయ సభల కార్యదర్శులతో పాటు ఆర్ అండ్ బీ అధికారులతో సమావేశమైన శ్రీధర్...ప్రత్యేక సమావేశం కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. అసెంబ్లీ సెంట్రల్ హాల్ పనులు సాగుతున్నందున సమావేశానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు శ్రీధర్ సూచించారు.