కేంద్రం ‘వాహన్‌’ పోర్టల్‌లోకి తెలంగాణ

కేంద్రం ‘వాహన్‌’ పోర్టల్‌లోకి తెలంగాణ
  •     వచ్చే నెల 15న చేరేందుకు రాష్ట్ర రవాణా శాఖ ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ రవాణా శాఖ పరిధిలోని ‘వాహన్’పోర్టల్లో వచ్చే నెల 15 నుంచి తెలంగాణ రవాణా శాఖ చేరనుంది. దీంతో ఇతర రాష్ట్రాల వాహనాలను మనం కొన్నా, తెలంగాణ రాష్ట్ర వెహికల్స్‌ను ఇతర రాష్ట్రాలకు అమ్మినా.. వాటికి సంబంధించిన అడ్రస్ మార్పు, యజమాని పేరు మార్పు వంటి సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం లభించనుంది. ఈ పోర్టల్‌లో తెలంగాణ రాష్ట్రం చేరకపోవడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన ఏ రకమైన వాహనం కొన్నా, మన వాహనాలను ఇతర రాష్ట్రాలకు అమ్మినా ఓనర్ పేరు మార్పు, అడ్రస్ మార్పు కోసం ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది.

ఇప్పుడు ఆ అవసరం లేకుండానే ఆన్‌లైన్‌లో ఈ పోర్టల్ ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఏర్పడింది. దేశంలోని చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ పోర్టల్‌లో చేరగా, చాలా ఏండ్ల తర్వాత మన ప్రభుత్వం ఈ పోర్టల్‌లో చేరేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు రాష్ట్ర రవాణా శాఖ తన సొంత యాప్‌ల ద్వారా మాత్రమే ఆన్‌లైన్ సేవలను అందిస్తోంది. దీంతో తరుచూ సాంకేతిక సమస్యలు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడేవారు.

ఇప్పుడు ఈ వాహన్ పోర్టల్‌లో తెలంగాణ చేరనుండడంతో ఇతర రాష్ట్రాల వాహనాలను తెలంగాణ వాసులు కొనుగోలు చేసినా, ఇక్కడి వాహనాలను ఇతర రాష్ట్రాలకు అమ్మినా ఆన్‌లైన్‌లో అన్ని మార్పులు చేసుకునే వెసులుబాటు కలగనుంది. రానున్న రోజుల్లో ఈ పోర్టల్ ద్వారా డూప్లికేట్ ఆర్సీని పొందే వీలుంటుంది. బ్యాంకుల ద్వారా వాహనాలపై లోన్ తీసుకున్న సందర్భంలో అవి ఆయా బ్యాంకుల పేరుమీదనే ఉంటాయి, లోన్ పూర్తిగా చెల్లించాక తిరిగి ఆ వెహికల్‌ మన పేరు మీదికి మార్చుకునేందుకు కూడా ఈ పోర్టల్ వినియోగించుకోవచ్చు.

ఈ చలాన్లు, రోడ్డు ట్యాక్స్‌లను ఈ పోర్టల్ ద్వారా చెల్లించే అవకాశం ఏర్పడనుంది. సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనుగోలు చేసే సమయంలో దాని చరిత్ర పూర్తిగా ఈ పోర్టల్ ద్వారా తెలిసిపోతుంది. కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వ పోర్టల్ ‘సారథి’లో కూడా తెలంగాణ ప్రభుత్వం చేరింది. సారథి పోర్టల్ ద్వారా కేవలం డ్రైవింగ్ లైసెన్స్‌ పొందే అవకాశం మాత్రమే ఉండగా, వాహన్ ద్వారా వెహికల్స్‌కు సంబంధించిన అన్ని రకాల అనుమతులను పొందవచ్చు.