పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యే లక్ష్యం..జేఈఈ, నీట్ కోసం మరో తొమ్మిది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌‌లు: మంత్రి అడ్లూరి

పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యే లక్ష్యం..జేఈఈ, నీట్ కోసం మరో తొమ్మిది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌‌లు: మంత్రి అడ్లూరి
  • భవిష్యత్ ఉపాధి అవకాశాల కోసం డిగ్రీలో ఏఐ కోర్సులు
  • టీజీఎస్‌‌డబ్ల్యూఆర్‌‌ఈఐఎస్ మూడో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో కీలక నిర్ణయాలు

హైదరాబాద్, వెలుగు: సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన, ప్రపంచ స్థాయి విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక  సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఇందుకోసం తొమ్మిదో తరగతి నుంచే నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు మరో 9 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌‌లను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఉన్నత విద్య కోసం దేశీయ, విదేశీ విశ్వవిద్యాలయాలకు వెళ్లే ఎస్సీ విద్యార్థులకు ల్యాప్‌‌టాప్‌‌లు, ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఎస్‌‌డబ్ల్యూఆర్‌‌ఈఐఎస్) మూడో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశం గురువారం సచివాలయంలో మంత్రి  అడ్లూరి  అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్ విద్య, ఉపాధ్యాయ సంక్షేమం, ఉన్నత విద్యావకాశాల విస్తరణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలను బోర్డు ఆమోదించింది.

డిగ్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు

భవిష్యత్‌‌ను దృష్టిలో పెట్టుకుని డిగ్రీ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. డిగ్రీ కాలేజీలకు న్యాక్ గుర్తింపు కోసం ప్రత్యేక కమిటీని  ఏర్పాటు చేస్తున్నామని, అధ్యాపకులకు యూజీసీ వేతన స్కేలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ‘‘హైదరాబాద్‌‌లో టీజీఎస్‌‌డబ్ల్యూఆర్‌‌ఈఐఎస్ ఆధ్వర్యంలో ఫార్మసీ కాలేజీ స్థాపనకు సూత్రప్రాయ ఆమోదం తెలిపాము.

క్రాఫ్ట్ టీచర్లు, ఆర్ట్ టీచర్లను టీజీటీలుగా గుర్తించే ప్రతిపాదనను కూడా ఆమోదించాం. రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న 133 గురుకులకు శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టేందుకు ప్రత్యేకంగా చర్చించాలని నిర్ణయించా”మని మంత్రి వెల్లడించారు. సమావేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ నికోలస్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి విజయేంద్ర బోయి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేష్ ధోత్రే, బోర్డ్ ఆఫ్ గవర్నర్ కౌన్సిల్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.