- వారం రోజుల్లో పథకాలపై సీఎంతో సమావేశం
- సచివాలయంలో వివిధశాఖల అధికారులతో సీఎస్ సమీక్ష
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అభివృద్ధి, ప్రభుత్వ పథకాలను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం అవసరమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేసేందుకు ఒక ప్రత్యేక డాష్‌బోర్డు, స్పీడ్ సెల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సోమవారం సచివాలయంలో వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ విజన్ డాక్యుమెంట్-2047 లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం వరకు ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలకు టీ-ఫైబర్ కనెక్టివిటీని తక్షణమే అనుసంధానించాలని ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పథకాల అమలుపై వారం రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డితో సమీక్ష నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికలతో అధికారులు రావాలన్నారు. నవంబర్ 14 నుంచి జరిగే 'ఖేలో ఇండియా' క్రీడోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీలు వేయాలన్నారు. అనంతరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
డిజిటల్ పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం
దేశంలోనే డిజిటల్ పెట్టుబడులకు తెలంగాణ, హర్యానా రాష్ట్రాలు ఎంతో అనుకూలంగా ఉన్నాయని ప్రపంచ బ్యాంక్ బృందం స్పష్టం చేసింది. సుమారు రూ.2 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను (డీపీఆర్) వెంటనే సిద్ధం చేసి సమర్పించాలని సూచించింది. సచివాలయంలో ప్రపంచ బ్యాంక్ గ్రూప్‌కు చెందిన డిజిటల్–ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేశ్ ఉత్తమ్‌చందానీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో సోమవారం సీఎస్ సంజయ్ జాజు సమావేశమయ్యారు.
'డిజిటల్ ఇండియా – వికసిత్ భారత్-2047' లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలో 'మీ సేవా' కేంద్రాల ఆధునీకరణతోపాటు భారత్ ఫ్యూచర్ సిటీలో నూతన డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్ విభాగంలో చేపడుతున్న వినూత్న సంస్కరణలను ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సీఎస్ సంజయ్ జాజు మాట్లాడుతూ మీ సేవా కేంద్రాలను మరింత పటిష్టం చేయడం ద్వారా పౌరులకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
