డ్రగ్స్, ఫుడ్‌‌ సేఫ్టీ విలీనానికి అడుగులు టీజీ సేఫ్ పేరుతో కొనసాగించాలని నిర్ణయం

డ్రగ్స్, ఫుడ్‌‌ సేఫ్టీ విలీనానికి అడుగులు టీజీ సేఫ్ పేరుతో కొనసాగించాలని నిర్ణయం
  • ఈ నెలాఖరులోపు విలీన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం
  • ఉన్నతాధికారిగా ఐపీఎస్‌‌కు బాధ్యతలు అప్పగించే చాన్స్​
  • కేసుల నమోదుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు

హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఆహార భద్రత (ఫుడ్ సేఫ్టీ) విభాగాన్ని, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ)తో విలీనం చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రెండు విభాగాలను కలిపి ‘టీజీ సేఫ్’(తెలంగాణ -సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్)పేరుతో నూతన అథారిటీగా కొనసాగించాలని భావిస్తోంది. ఈ నెలాఖరులోపు విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఈ విలీనం పూర్తయితే జీహెచ్‌‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీల పరిధి నుంచి ఫుడ్ సేఫ్టీ విభాగం విడిపోనుంది.

ప్రస్తుతం ఆయా కార్పొరేషన్లలో పనిచేస్తున్న 17 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, ఐదుగురు గెజిటెడ్ ఫుడ్ ఇన్‌‌స్పెక్టర్లు నేరుగా టీజీ సేఫ్ పరిధిలోకి వెళ్లనున్నారు. ఇప్పటివరకు మెడిసిన్స్‌‌ నాణ్యత, నకిలీ మందుల నిరోధం, అక్రమ ఔషధాల విక్రయాలపై డ్రగ్స్ కంట్రోల్ విభాగం కఠినంగా వ్యవహరిస్తోంది. సరిగ్గా ఇదే తరహా విధానాన్ని ఫుడ్‌‌ సెఫ్టీ రంగంలోనూ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇన్నాళ్లూ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో సాగిన ఫుడ్ సేఫ్టీ విభాగం, ఈ విలీనం తర్వాత ఐపీఎస్ అధికారి కంట్రోల్‌‌లోకి రానుంది. టీజీ సేఫ్ విభాగానికి ఉన్నతాధికారిగా ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించే అవకాశాలు ఉన్నాయి.

ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు.. 

విలీనం అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఆహార తనిఖీలను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. నిబంధనలు ఉల్లంఘించే హోటళ్లు, తయారీ సంస్థలపై భారీ జరిమానాలు విధించడంతో పాటు లైసెన్సుల రద్దు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఫుడ్, డ్రగ్స్ అధికారులకు నేరుగా కేసులు నమోదు చేసే అధికారాలు లేకపోవడంతో, ఉల్లంఘనలు జరిగితే స్థానిక పోలీస్ స్టేషన్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ‘టీజీ సేఫ్’పరిధిలోనే ప్రత్యేకంగా ఒక పోలీస్ స్టేషన్‌‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడే నేరుగా కేసులు నమోదు చేసే అవకాశం ఉండటంతో కల్తీలు, ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు మార్గం సుగమమవుతుంది.

ఈ నెలాఖరులోగా విలీనం..

ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో జీహెచ్‌‌ఎంసీ, స్టేట్ ఫుడ్ సేఫ్టీ, హెచ్-ఫాస్ట్ వంటి వేర్వేరు బృందాలు తనిఖీలు చేస్తుండటంతో పర్యవేక్షణలో స్పష్టత లోపిస్తోంది. టీజీ సేఫ్ ఏర్పాటుతో ఇకపై తనిఖీలన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చి పక్కాగా సాగనున్నాయి. ఈ విలీన ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై స్పష్టమైన ప్రకటన చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇప్పటికే ఈ విషయమై ఫుడ్ సేఫ్టీ అధికారులకు అంతర్గత సమాచారం అందించినట్లు తెలుస్తోంది. విలీనం తర్వాత ఫుడ్ సేఫ్టీ తనిఖీలు మరింత వేగవంతం కావడంతో పాటు ఆహార నాణ్యతపై పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం కానుందని అధికారులు భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు