- ఎల్వీపీఈఐతో కలిసి నవజాత శిశువుల కంటి పరీక్షలు, రీజినల్ ఐ బ్యాంకుల ఏర్పాటు
- 35 మెడికల్ కాలేజీలు, జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేక ఓటీలు, పరికరాల ఏర్పాటు
- గ్యాప్ అసెస్మెంట్ పూర్తి చేసిన ఆరోగ్య శాఖ.. త్వరలోనే ప్రణాళిక అమలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కంటి వైద్య సేవలను బలోపేతం చేసేందుకు ప్రముఖ సంస్థ ‘ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్’ (ఎల్వీపీఈఐ) తో భాగస్వామ్యం కానున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రజలందరికీ సులభంగా నాణ్యమైన కంటి వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్యాన్ని ఉపయోగించుకోనున్నట్టు తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎల్వీపీఈఐ సహకారంతో ప్రయోగాత్మకంగా చేపట్టిన నియోనాటల్ ఐ స్క్రీనింగ్ పైలట్ ప్రాజెక్టును ఇతర జిల్లాలకూ దశలవారీగా విస్తరించనున్నారు.
నేత్రదానాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ఎల్వీపీఈఐ భాగస్వామ్యంతో ప్రాంతీయ కార్నియా సేకరణ కేంద్రాలను (కంటి బ్యాంకులు) ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అలాగే, రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమ్ (ఆర్బీఎస్కే) శిక్షణల ద్వారా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు ఆప్టోమెట్రిక్ సేవలను మరింత మెరుగుపరచనున్నారు. ఎల్వీపీఈఐతో మరిన్ని భాగస్వామ్య రంగాలను గుర్తించి అమలు చేసేందుకు ఆగస్టు నెలలో ప్రభుత్వ అన్ని టీచింగ్ హాస్పిటల్స్ లో వర్క్‌షాప్ నిర్వహించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల నెట్‌వర్క్ ను పటిష్టం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని కంటి వైద్య విభాగాలు ప్రజలకు నిపుణుల ద్వారా సేవలు అందిస్తున్నాయి. ఈ టీచింగ్ హాస్పిటల్స్ లో సాధారణంగా ఆప్టోమెట్రీ సేవలతో పాటు కంటి శుక్లాల (కాటరాక్ట్) ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఇక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ఉన్న హైదరాబాద్‌లోని సరోజిని దేవి కంటి ఆస్పత్రిలో రెటినల్ సర్జరీలు, లేజర్లు, మెల్లకన్ను (స్క్వింట్) సర్జరీలు, కార్నియా మార్పిడి, ఆక్యులర్ ఆంకాలజీ, ప్లాస్టిక్ సర్జరీలు, గ్లాకోమా మేనేజ్‌మెంట్ వంటి అనేక రకాల చికిత్సలు అందిస్తున్నారు.
జిల్లా హాస్పిటల్స్ లో స్పెషల్ ఓటీలు..
రాష్ట్రవ్యాప్తంగా కంటి ఆరోగ్య రిఫరల్ వ్యవస్థను మెరుగుపరచడంలో భాగంగా జిల్లా స్థాయి టీచింగ్ హాస్పిటల్స్ ను బలోపేతం చేయనున్నారు. ఇందుకోసం జిల్లా టీచింగ్ ఆస్పత్రుల్లో కంటి వైద్యం కోసం ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్, అత్యాధునిక పరికరాలను సమకూర్చనున్నారు. దీనికి సంబంధించి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇప్పటికే గ్యాప్ అసెస్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేసింది. నిర్దేశిత వ్యవధిలో ప్రభుత్వం వీటిని సమర్థవంతంగా అమలు చేయనుంది.
