అలల సోయగం..  జల విహారం!..రామప్పలో ‘తేలియాడే రెస్టారెంట్’.. లక్నవరంలో ప్రీమియం బోట్లు

అలల సోయగం..  జల విహారం!..రామప్పలో ‘తేలియాడే రెస్టారెంట్’.. లక్నవరంలో ప్రీమియం బోట్లు
  • రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో బోటింగ్ సదుపాయాల విస్తరణ
  • భద్రత కోసం లైఫ్ జాకెట్లు, పర్సనల్ ఫ్లోటేషన్ డివైజ్‌లు, లైఫ్ బాయ్‌ల కొనుగోలు
  • టెండర్లు ఆహ్వానించిన తెలంగాణ టూరిజం అభివృద్ధి సంస్థ

హైదరాబాద్‌, వెలుగు : రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలకు కొత్త కళ సంతరించుకోనున్నది. ప్రకృతి అందాలకు తోడు, నీటిపై విహరించే పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. నీటి వనరులు ఉన్నచోట అత్యాధునిక బోట్లు, ఫ్లోటింగ్ జెట్టీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పర్యాటకులను ఆకర్షించేలా రామప్పలో తేలియాడే రెస్టారెంట్‌ను, లక్నవరంలో ప్రీమియం బోట్లను అందుబాటులోకి తీసుకురావడానికి బుధవారం టెండర్లను ఆహ్వానించింది. జూన్​ 10వ తేదీన ఈ టెండర్​ ప్రక్రియ ముగియనున్నది. ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్పకు వచ్చే పర్యాటకుల కోసం పర్యాటక శాఖ వినూత్నంగా ‘సెల్ఫ్ ప్రొపెల్డ్ స్టీల్ ఫ్లోటింగ్ రెస్టారెంట్‌’ను ఏర్పాటు చేయనుంది. స్టీల్‌తో నిర్మించిన ఈ రెస్టారెంట్‌లో నీటిపై విహరిస్తూ.. ప్రకృతి అందాలను వీక్షిస్తూ భోజనం చేసే సౌకర్యం పర్యాటకులకు మరుపురాని అనుభూతిని ఇవ్వనుంది. 

ఆరు ప్రాంతాల్లో బోటింగ్‌ సేవల విస్తరణ

రాష్ట్రంలోని వివిధ చెరువులు, రిజర్వాయర్ల వద్ద బోటింగ్ సేవలను మెరుగుపరచడానికి పర్యాటక సంస్థ భారీగా నిధులను వెచ్చించనున్నది.  లక్నవరంలో 20 సీట్ల సామర్థ్యం గల ప్రీమియం క్యాటమరాన్ బోట్లు, స్పీడ్ బోట్లు, పెడల్ బోట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. బోరంచలో భారీ క్యాటమరాన్ బోట్లు, స్పీడ్ బోట్లను ఏర్పాటు చేయనున్నారు. కమలాపూర్, గుడిచెరువు, నల్లవాగు ప్రాంతాల్లో పర్యాటకులు సురక్షితంగా బోట్లు ఎక్కేందుకు స్టీల్ ఫ్లోటింగ్ జెట్టీలను, కొత్త స్పీడ్ బోట్లను అందుబాటులోకి తేనున్నారు.

వీటితో పాటు అత్యుత్తమ నాణ్యత కలిగిన లైఫ్ జాకెట్లు, పర్సనల్ ఫ్లోటేషన్ డివైజ్‌లు (పీఎఫ్​డీ), లైఫ్ బాయ్‌ల కొనుగోలుకు టెండర్లు ఆహ్వానించారు. వాటర్ ఫ్లీట్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు, కొత్త బోట్ల రూపకల్పనలో సాంకేతిక సలహాల కోసం నిపుణులైన ‘నావల్ ఆర్కిటెక్ట్‌ల’ను ఎంపానెల్ చేయాలని నిర్ణయించారు. పర్యాటకుల భద్రతపై టూరిజం ఎండీ గౌతమి ప్రత్యేక ఫోకస్​ పెట్టారు. పర్యాటకుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో నీటిపై ప్రయాణించే పడవలు (వాటర్​ ఫ్లీట్​) ఆపరేషన్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కఠినమైన భద్రతా నిబంధనలు అమలు చేయాలని ఆమె ఆదేశించారు.

ప్రతిరోజూ బోట్లు నీటిలోకి వెళ్లే ముందు ఇంజిన్​ కండిషన్​, ప్యూయల్​ లెవల్స్​, ఎమర్జెన్సీ ఎక్విప్​మెంట్​, కమ్యూనికేషన్​ సిస్టమ్స్​ వంటి అంశాలను ‘డైలీ చెక్​ లిస్ట్​’ ద్వారా తనిఖీ చేయాలని  సూచించారు. పర్యాటకుల భద్రత విషయంలో ‘జీరో టాలరెన్స్​’ విధానాన్ని అనుసరించాలన్నారు. ప్రతి పర్యాటకుడు తప్పనిసరిగా లైఫ్​జాకెట్​ ధరించాలని, వినోదమే కాదు, పర్యాటకుల భద్రతే పరమావధిగా పనిచేయాలని తెలిపారు.

డబుల్ కానున్న ఆదాయం

పర్యాటకశాఖకు బోటింగ్ ద్వారా భారీగా ఆదాయం సమకూరుతున్నది. గతేడాది కేవలం బోటింగ్ ద్వారానే సర్కార్ ఖజానాకు రూ.13 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు సౌకర్యాలను మరింత పెంచుతుండటంతో ఈ ఆదాయం డబుల్ అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే రామప్పలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ లాంటి కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.  ఇప్పటివరకు కేరళ, కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లోనే చూసిన హౌస్ బోట్లు, ఫ్లోటింగ్ రెస్టారెంట్లు ఇప్పుడు మన దగ్గర ఏర్పాటు కాబోతున్నాయి. ఈ రెస్టారెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నీళ్లపై తేలుతూనే డిన్నర్లు చేయొచ్చు. బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేలు, చిన్న చిన్న గెట్ టు గెదర్ పార్టీలు చేసుకునేలా దీనిని డిజైన్ చేస్తున్నారు.