హైదరాబాద్, వెలుగు: ఎరువుల సరఫరాలో రైతులకు పారదర్శకమైన సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం తెలిపారు. ఈ యాప్‌లోని రియల్‌టైమ్ స్టాక్ వివరాలు, రైతుల డిజిటల్ బుకింగ్, పంటల ఆధారంగా యూరియా కేటాయింపు, డ్యాష్‌బోర్డు పర్యవేక్షణ, డేటా ఆధారిత సరఫరా వ్యవస్థ వంటి వినూత్న అంశాలపై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేసిందన్నారు.
యూరియా పంపిణీలో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపిన తెలంగాణ మోడల్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిందని పేర్కొన్నారు. యూరియా కొరత అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే ప్రయత్నాలు గతంలో జరిగాయని తెలిపారు. యాప్ ద్వారా రైతులు సమీప ప్రాంతాల్లోని కేంద్రాల్లో యూరియా నిల్వలను ముందుగానే తెలుసుకుని ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే అవకాశం లభించడంతో సమస్యకు చెక్ పడిందన్నారు.
