- నావలి ప్రాజెక్టు నిర్మిస్తే 15 టీఎంసీలు ఇవ్వాలన్న ఏపీ
హైదరాబాద్, వెలుగు: ఆర్డీఎస్ ను ఆధునీకరించి నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించాలని తెలంగాణ సర్కారు కేంద్రాన్ని కోరింది. సోమవారం ఢిల్లీలో తుంగభద్ర జలాలపై కేంద్రం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. తొలి భేటీలో ప్రధానంగా కేంద్రం జారీచేసిన మార్గదర్శకాల్లో భాగమైన తుంగభద్ర రిజర్వాయర్‌లో పూడికతీత, నీటి నిల్వ సామర్థ్యం, సాగు, తాగునీరు, జల విద్యుత్ ఉత్పత్తిపై పడే ప్రభావం, సాంకేతిక, ఆర్థిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ అధికారులు ఆర్డీఎస్కు సంబంధించి పలు అంశాలను ప్రస్తావించారు. ఆర్డీఎస్‌పై నిపుణుల కమిటీ నివేదికను హైపవర్ కమిటీ ఆమోదించడంతోపాటు దాని అమలుకు చర్యలు చేపట్టాలని అధికారులు కోరారు. అయితే, దీనిపై 15 రోజుల్లో అభిప్రాయాలు వెల్లడిస్తామని హైపవర్ కమిటీ చైర్మన్ తెలిపారు.
అన్ని జలాశయాల మాదిరిగానే తుంగభద్ర డ్యామ్‌లోనూ పూడిక పేరుకుపోతోందని వివరించారు. ఇక డ్యామ్‌లో పూడికతీత కోసం అనుసరించాల్సిన విధానాలు, అందుకయ్యే ఖర్చు తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా సబ్‌కమిటీని ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ సబ్ కమిటీ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న పూడిక తొలగింపు అంశాలను అధ్యయనం చేయాలని నిర్ణయించారు. అయితే, తుంగభద్రకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా నావలి ప్రాజెక్టు నిర్మిస్తే తమకు అదనంగా 15 టీఎంసీలు ఇవ్వాలని ఏపీ సర్కారు ప్రతిపాదనలు పెట్టినట్లు తెలిసింది. 15 రోజుల్లో మరోసారి భేటీ కావాలని హైపవర్ కమిటీ నిర్ణయించింది. సమావేశంలో తెలంగాణ నుంచి ఈఎన్సీ రమేశ్‌బాబు, ఇంటర్ స్టేట్ అధికారులు వర్చువల్‌గా పాల్గొన్నారు.
