‘ప్రపంచం అంతటా కనిపించే ఉత్తుత్తి హీరోలు మనకు అవసరం లేదు, నిజమైన హీరోలు కావాలి. వాస్తవిక హీరోలు అలా పుట్టరు, తాము ఎంచుకునే మార్గాలు, నిలబడే విధానాలు, పాటించే విలువలనుబట్టి వారు హీరోలుగా రూపొందుతారు’ అంటాడు మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యవహార శైలి చూస్తుంటే, మనిషిని మరొక మనిషి పీడించని ఉదాత్త సామ్యవాద ప్రపంచాన్ని కలలుగన్న (‘ఐ యావ్ ఎ డ్రీమ్..) మహనీయుడు మార్టిన్ లూథర్‌కింగ్ పైన చెప్పిన మాటలు నాకు గుర్తొస్తాయి. అందుకే, నవతరం యువత కూడా ‘రీల్’ హీరోలు కాదు ‘రియల్’ హీరోలు ముఖ్యమని ఎంత తొందరగా గ్రహిస్తే సమకాలీన సమాజానికి అంత ఎక్కువగా మంచి జరుగుతుందని నా నమ్మకం. ఎవరెవరి జీవితం అంతకుముందు ఎలా ఉన్నా, కనీసం ప్రజాజీవితంలోకి వచ్చాక అయినా నాయకులు ఎందుకు సహేతుకంగా ఆలోచించరు? అని నాకు ఆశ్చర్యం కలుగుతుంది.
పరస్పర విరుద్ధమైన భావనలు వ్యక్తం చేసే ఆయన ధోరణి మొదట్నుంచీ వివాదాస్పదమే! ‘చెగువెరా నా ఆదర్శం’ అంటాడు, ప్రధాని మోదీకి మోకరిల్లుతాడు. ‘కమ్యూనిస్టులు నాకు ఆదర్శం అంటాడు, సనాతన ధర్మానికి సలామ్’ అంటాడు. విధానాలపరంగా నిలకడలేనితనం, ఆలోచనల రీత్యా స్పష్టత లేకపోవడం ఆయన స్వభావం అయి ఉండవచ్చు! కానీ, ఇప్పుడు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ‘నవనిర్మాణ సభ’ అంటూ తలపెట్టి, అదీ రాష్ట్రావతరణ దినోత్సవంనాడే జరపాలనుకోవడం ఆయన కుత్సితపు బుద్ధిని వెల్లడి చేస్తోంది.
ఇది భావోద్వేగాల తెలంగాణను అవమానించడమే కాదు, బస్తీమే సవాల్ అన్నట్టు రెచ్చగొట్టడంగా కూడా భావించాలి. పవన్ కల్యాణ్ తలపెట్టిన ఈ సమావేశం వెనుక ఓ లోతైన కుట్ర దాగి ఉంది. లేకుంటే, ఇటువంటి సభను ఏ కర్నాటకలోనో, తమిళనాడులోనో ఎందుకు పెట్టుకోలేదు? తెలంగాణ పట్ల ఒక ఎరుక, అది ఏర్పడ్డ విధానంపై ఓ అవగాహన, ఇక్కడి సమాజంపైన కనీస గౌరవం ఉన్నా ఆయనీ దుందుడుకు నిర్ణయానికి వచ్చి ఉండేవారు కాదేమో? అనిపిస్తుంది. అది తెలుసుకుంటే ఆయనకే మంచిది.
త్యాగాల పురిటి గడ్డ
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేక పోరాటం నుంచి దేశ ప్రజలందరి కన్నా ఏడాది ఆలస్యంగా స్వేచ్ఛా వాయువులు పొందిన క్రమంలో... దాదాపు ఎనిమిది దశాబ్దాల తండ్లాట తెలంగాణ. సాయుధపోరాటం, రక్తతర్పణం, విమోచనోద్యమం, హైదరాబాద్ రాష్ట్ర ఏర్పాటు, ఇతరులతో బలవంతపు కలయికతో విశాలాంధ్ర, దశాబ్దాల అణచివేత, అలక్ష్యం, తొలి, మలి దశ ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర’ ఉద్యమాలు.. ఇదంతా చెరిగిపోని చరిత్ర! మౌనంగా రోధిస్తూనే రాజ్యాంగానికి లోబడి, ప్రజాస్వామ్యయుతంగా పోరాటాలు జరిపిన పురిటిగడ్డ తెలంగాణ. విద్యార్థులు, యువత, శ్రమజీవుల.. ప్రాణత్యాగాల నుంచి మేధావుల మథనం, సకల జనుల సమ్మె, సబ్బండ వర్ణాల ఆర్తి దాకా ఎడతెగని పోరాటం.
ఆధిపత్య పాలకుల దాష్టీకాలన్నీ సహించి, భరించి ఇకపై ఒక్క బొట్టు నెత్తురు కూడా నేలపై చిందకూడదని సాగించిన ఉద్యమపోరు అంతిమంగా ఫలించి రాష్ట్రం ఏర్పడింది. ఎవరి దారులు వారికయ్యాయి. తెలుగు భాష మాట్లాడే రెండు రాష్ట్రాలు ఎంతో హుందాగా, గౌరవంగా భారత చిత్రపటంలో భాగమయ్యాయి. ప్రాంతాలకు, వర్గాలకు, పార్టీలకు అతీతంగా అందరం మూకుమ్మడిగా అనుకున్నదే, ప్రజల కోరికను మన్నించి.... ‘రాష్ట్రాలుగా విడిపోదాం, తెలుగువారిగా కలిసి ఉందాం’ అని!
వైషమ్యాలు పెంచే దుర్బుద్ధి ఎందుకు?
నిజాయితీతో కూడిన పోరు ఫలించి, రాజ్యాంగం నిర్దేశించినట్లుగా పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇది జరిగి పుష్కర కాలం గడిచింది! కుళ్లు, కుత్సిత రాజకీయాల జోలికి వెళ్లని కోట్లాది తెలుగు ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరస్పరం ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, వ్యక్తిగత బంధాలతో హాయిగా ఉన్నారు. స్వేచ్ఛగా, యధేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నారు. వాణిజ్య, వ్యాపారాలతో, పిల్నల్ని ఇచ్చి పుచ్చుకునే కుటుంబ సంబంధాలతో, పరస్పర ప్రేమానురాగాలతో ఎంతో కులాసాగా ఉన్నారు. చిచ్చుపెట్టే కాలుష్యపు ఆలోచనలు ఎందుకు? రెండు రాష్ట్రాల ప్రజల మధ్య వైషమ్యాలు పెంచే దుర్బుద్ధి ఎందుకు? ఇప్పుడు ఎందుకీ నవనిర్మాణ సమావేశం? సగటు తెలంగాణవాదులు ఈ ప్రశ్నల్ని లేవనెత్తుతున్నారు.
వాడుకోవడం కాదు, బుద్ధి చెప్పండి
‘స్వతహాగా ఇదంతా మీ దుర్బుద్ధే అయితే తక్షణం మార్చుకోండి. కాదు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేసే తలంపుతో తెలంగాణలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే బీజేపీ ఎత్తుగడ అయితే, అందులో మీరు పావు కావద్దు’ అని పవన్ కల్యాణ్‌కు సూచించాల్సి వస్తోంది. ‘మొన్న హైదరాబాద్ పర్యటనకు వచ్చినపుడు, మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలిసిన దేశ ప్రధాని మోదీ మీకు చెప్పింది ఇదేనా?’ తెలంగాణ భావోద్వేగాల్ని రెచ్చగొట్టి, లేని రాజకీయ పునరేకీకరణలతో లబ్ధిపొందే బీజేపీ దురాలోచన మంచిది కాదు. తెలుగు ప్రజల మధ్య ఉద్రిక్తతలు రేపేలా కింది స్థాయి కార్యకర్తలు విచక్షణ కోల్పోయి మాట్లాడితే జనసేన అధిపతిగా పవన్ కల్యాణ్ వారికి బుద్ధి చెప్పాలి.
పవన్ కల్యాణ్ మాటలు కట్టుదప్పితే కూటమి నాయకులైన ఏపీ సీఎం చంద్రబాబో, ప్రధాని మోదీయో ఆయనకు సర్దిచెప్పాలి. తెలంగాణ సమాజాన్ని అవమానించడం, రెండు తెలుగు రాష్ట్ర సమాజాల మధ్య కలతలు, వైష్యమ్యాలు పెంచే చర్యలనో ఉపేక్షించడం, పురికొల్పడం సరికాదు. అది ఎవరికీ మంచిది కాదు. విశాల సమాజహితంలో సంకుచిత రాజకీయ ధోరణులను వీడాలి. ఈ విజ్ఞత అన్ని రాజకీయ పక్షాలకు ఉండాలి. తెలంగాణ ఉద్యమాల్లో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తిగా నా స్వీయ అనుభవంతో చెబుతున్న మాటల్ని పవన్ కళ్యాణ్ పెడచెవిని పెట్టొద్దు.
తెలంగాణ సమాజంలో కలతలు రేపే రీతిన దుందుడుకుగా వ్యవహరిస్తే..వారి కుయుక్తుల్ని తిప్పికొట్టడమే కాకుండా తగిన గుణపాఠం చెప్పేందుకు తెలంగాణ పౌరసమాజం సదా సిద్ధంగా ఉంటుందని నేను గుర్తు చేస్తున్నాను. కటువైనదే అయినా ఒక మాట చెప్పాల్సి వస్తోంది. ఖబడ్దార్! ఒకోసారి ఒకరి అజ్ఞానాన్ని లేదా అవగాహనా లేమిని దయతో, కరుణతో క్షమిస్తుంది తెలంగాణ సమాజం. కానీ, అహంకారాన్ని, వైష మ్యాలు రేపే కుట్రలనూ, కుతంత్రాలనూ తెలంగాణ సమాజం ఎన్నటికీ సహించదు. తస్మాత్ జాగ్రత్త!
ఏమన్నావో గుర్తు తెచ్చుకో!
భారత రాజ్యాంగం కల్పించిన సౌకర్యాన్నిబట్టి ఎవరైనా, ఎక్కడైనా సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో ఎవరో సభ పెడితే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ, తెలంగాణ విషయంలో, తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి ఎలా వ్యవహరించాడో, ఏమి మాటలన్నాడో పవన్ కల్యాణ్ ఒకమారు గుర్తు తెచ్చుకోవాలి. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదు’ అని ఆయనే స్వయంగా వెల్లడించారు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను పణంగా పెట్టి ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ ఆధిపత్య వర్గాలు దశాబ్దాలు దోపిడీ పర్వం సాగించి, అది ఆగిపోవద్దనే కుయుక్తితోనే సమైక్య నినాదం వినిపించారు. తెలంగాణ ఏర్పాటును మొదట్నుంచీ అడ్డుకుంటూ వచ్చారు.
‘తమరిదీ అదే భావనా? అందుకే తెలంగాణ ఏర్పాటును జీర్ణించుకోలేకపోయారా? తెలంగాణ సకల జనుల ప్రత్యేక రాష్ట్ర కాంక్షను, ఆవశ్యకతను, దాదాపు అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించి, ఆమోదించిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని తమరు మాత్రం గుర్తించలేదని, అంగీకరించలేదనే కదా దీని అర్థం! రాష్ట్రం ఏర్పడి, ఎవరి పాలన వారు సాగిస్తూ తమదైన రీతిలో ప్రగతి సాధిస్తున్న క్రమంలో... ఉన్నట్టుండి ‘తెలంగాణ వారి దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి’ అనడం అంటే, అదెంత తీవ్రమైన వ్యాఖ్య?! ఎవరో రచయిత స్క్రిప్టు రాసిస్తే, దర్శకుడు దిశా నిర్దేశం చేస్తే డైలాగులు వల్లెవేయడం కాదు కదా ప్రజాజీవితమంటే! ఏదో దారిన పోయే సామాన్యమైన వ్యక్తిగా కాకుండా ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి అలా మాట్లాడిన విషయం మరిచిపోయారా? ఇటువంటి మీ వైఖరిని, మీ వ్యాఖ్యల్ని తెలంగాణ సమాజం ఎలా స్వీకరిస్తుందని భావిస్తున్నారు?’ సినీ హీరోగా కళా నైపుణ్యాన్ని బట్టి ఆదరిస్తారు, నాయకుడిగా విధానాలను బట్టి స్పందిస్తారు. ఈ అంశాల్ని దృష్టిలో ఉంచుకొనే తెలంగాణ సమాజానికి క్షమాపణలు తెలిపి హైదరాబాద్‌కు రావాలని నేను సూచించాను.
పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖల అమాత్యులు, తెలంగాణ
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
