యాలక్కాయలు, లవంగాలు.. మనం పండించలేమా?

యాలక్కాయలు, లవంగాలు.. మనం పండించలేమా?

రాష్ట్రంలో సుగంధ ద్రవ్యాల వాడకం ఎక్కువే. కానీ సాగు చాలా తక్కువ. కొన్నింటిని పూర్తిగా దిగుమతి చేసుకుంటున్నాం.ఏటా లక్షల మెట్రిక్‌ టన్నుల సుగంధ ద్రవ్యాలనువాడుతున్నా వాటిని ఇక్కడ పండించడం లేదు. ఈవిషయంపై ఉద్యాన శాఖ దృష్టి పెట్టింది. సుగంధ ద్రవ్యాల పంటలకు అనుకూలమైన ప్రాంతాల కోసం వెతుకుతోంది. రాష్ట్రంలో ప్రధానంగా 15 సుగంధ ద్రవ్యాలను ఎక్కువ వాడుతుంటారు. అందులో పసుపు, మిర్చి మాత్రమే అవసరానికి మించి పండుతున్నా యి. మిగతా 13లో అల్లం, వెల్లుల్లి, ధనియాలు అరకొరగా పండిస్తున్నారు. మిగతా10 పంటలు పూర్తిగా దిగుమతి చేసుకోవాల్సిందే. యాలకులు, లవంగాలు, మెంతులు, జీలకర్ర, వాము, దాల్చిన చెక్క, మిరియాలు, ఆవాలు, గసగసాలు తదితర సుగంధ ద్రవ్యాల పంటలు రాష్ట్రంలోమచ్చుకైనా కనిపించవు.

దిగుమతి చేసుకునేవే ఎక్కువ
ఏటా రాష్ట్రంలో11,730 మెట్రిక్‌ టన్నుల ధనియాలు,10,800 మెట్రిక్‌ టన్నుల జీలకర్రకొరత ఉంటోంది. 49,000 మెట్రిక్‌ టన్నుల అల్లం,35వేల మెట్రిక్‌ టన్నుల వెల్లుల్లి అదనంగా అవసరం అవుతోంది. చివరకు చింతపండు కూడా 54 వేలమెట్రిక్‌ టన్నుల కొరత ఉండడం గమనార్హం. దాల్చిన చెక్క 1500 మెట్రిక్‌ టన్నులు, యాలకులు960 మెట్రిక్‌ టన్నులు, లవంగాలు 1000 మెట్రిక్‌టన్నులు, గసగసాలు 240 మెట్రిక్‌ టన్నులు, మిరియాలు 240 మెట్రిక్‌ టన్నుల కొరత ఉంది.దీంతో కేరళ నుంచి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క తదితర సుగంధ ద్రవ్యాలను దిగుమతిచేసుకుంటున్నాం. రాజస్థాన్‌, గుజరాత్‌ ల నుంచి జీలకర్ర, వాము, ఆవాలు తదితరాలు దిగుమతి అవుతున్నాయి.

సుగంధ ద్రవ్యాల సాగుపై అధ్యయనం
ఇటీవల రాజస్థాన్‌ లో జరిగిన స్పైసెస్‌ జాతీయ సదస్సుకు వెళ్లివచ్చిన ఉద్యాన శాఖ డైరెక్టర్‌ వెంకట్రామ్‌ రెడ్డి రాష్ట్రంలో సుగంధ ద్రవ్యాల సాగుపై దృష్టిసారించారు. ఇక్కడి వాతావరణం, నేలలు తదితర అంశాలపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు.మెదక్‌ , జహీరాబాద్‌, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో అల్లం పంట 5,040 ఎకరాల్లో సాగవుతోంది. రాష్ట్ర అవసరాలకు మరో 10 వేల ఎకరాల్లో సాగుచేయాల్సి ఉంది. వెల్లుల్లి పాత మెదక్‌ జిల్లాలో 478ఎకరాల్లో సాగవుతుండగా మరో 37,435 ఎకరాల్లో సాగు చేస్తేనే రాష్ట్ర అవసరాలు తీరుతాయి. జీలకర్ర, వాము, ఆవాలతోపాటు మరికొన్ని పంటలు పండించేందుకు రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉందని అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో సుగంధ ద్రవ్యాల సాగుపై రైతులకు అవగాహనకల్పించాలని నిర్ణయించారు.

ఫస్టు చింతచెట్లు పెంచుదాం
ఏటా 54 వేల మెట్రిక్‌ టన్నుల చింత పండు వినియోగం జరుగుతుంటే, ఉత్పత్తి మాత్రం అంతమేరకు లేదు. దీంతో చింత చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. పొలంగట్లు, మెట్టప్రాంతాల్లో చింత చెట్లు నాటాలని, రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల ఎకరాల్లో 10,83,600 చింత చెట్లుపెంచాలని ఉద్యాన శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. 63 వేల మెట్రిక్‌ టన్నుల అల్లం అవసరముండగా కేవలం 14 వేల మెట్రిక్‌ టన్నులే ఉత్పత్తి అవుతోంది. ఇంకా 48,960 మెట్రిక్‌ టన్నుల కొరత ఉంది. దీంతో ప్రస్తుతం సాగుచేస్తున్న దానికి అదనంగా మరో పదివేల ఎకరాల్లో అల్లం సాగుచేయాలి. ఉల్లిగడ్డ కూడా 55 వేల మెట్రిక్‌ టన్నుల కొరత ఉంది.