ఆయిల్ పామ్ సాగు విస్తరణలో అలసత్వం వహిస్తే చర్యలు..మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరిక

ఆయిల్ పామ్ సాగు విస్తరణలో అలసత్వం వహిస్తే చర్యలు..మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరిక
  •     85 వేల ఎకరాల్లో సాగు విస్తరణే లక్ష్యమని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణలో అలసత్వం వహిస్తున్న కంపెనీలపై కఠిన చర్యలు తప్పవని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. టార్గెట్ సాధనలో విఫలమైతే కంపెనీల పరిధిలోని జిల్లాలను తగ్గించడం, పూర్తిగా తొలగించడం వంటి చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఫెడ్‌‌‌‌కు ఎలాంటి మినహాయింపు ఉండదని, పనితీరు సరిగా లేకుంటే దాని పరిధిలోని జిల్లాలను ఇతర సంస్థలకు అప్పగిస్తామన్నారు.

శుక్రవారం సెక్రటరియట్‌‌‌‌లో ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది రాష్ట్రంలో 85 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటివరకు కేవలం 17,090 ఎకరాల్లో మాత్రమే సాగు నమోదైందని తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నప్పటికీ కంపెనీల్లో ఆశించిన చిత్తశుద్ధి కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

రైతులు ముందుకు వస్తున్నప్పటికీ కంపెనీలు వెనుకబడటం సరికాదన్నారు. నిర్మాణంలో ఉన్న ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.