రాగల 3 రోజులకు వాతావరణ సూచన

రాగల 3 రోజులకు వాతావరణ సూచన

రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిస్తాయని చెప్పింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుందని, గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కొన్నిచోట్ల  భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.

నైరుతి రుతుపవనాలు ఆలస్యం : 
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ఇంకా ప్రవేశించలేదు. దీంతో రైతులు వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రుతుపవనాలు ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులున్నాయని అంచనా వేసింది. రుతుపవనాలు రేపు లేదా ఎల్లుండి రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం బంగాళాఖాతంలోకి ఎంటర్ అయ్యాయని.. పశ్చిమ, మధ్య, వాయువ్య బంగాళాఖాతంలోకి రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, కొంకణ్‌లోని మిగిలిన భాగాలు.. గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలు, కర్ణాటక అంతటా, తమిళనాడు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ మధ్య & వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం ఈశాన్య బంగాళాఖాతం నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఉన్న ద్రోణి ఆదివారం ఈశాన్య బంగాళాఖాతం నుండి మధ్య బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ & 5.8 కి.మీ ఎత్తులో ఉందని ప్రకటించింది.