- నేటి నుంచి వానలు
- రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం
- నేడు ఆరెంజ్ అలర్ట్.. రేపటి నుంచి ఐదు రోజులు ఎల్లో అలర్ట్ జారీ
- కేరళ సమీపానికి నైరుతి రుతుపవనాలు.. తగ్గిన ఉష్ణోగ్రతలు
హైదరాబాద్, వెలుగు: ఎండలతో అల్లాడిపోయిన జనానికి కాస్త ఉపశమనం కలిగించేలా వారం పాటు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఇప్పటికే అరేబియా సముద్రంలో రుతుపవనాలు యాక్టివ్‌గా కదులుతున్నాయి. కేరళ తీరానికి అత్యంత సమీపానికి చేరుకున్నాయి. దీని ప్రభావంతో కేరళలో పలుచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. వాతావరణం కూడా రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూలంగా ఉండడంతో.. బుధవారం అర్ధరాత్రి దాటాక తీరాన్ని దాటి కేరళలోకి ప్రవేశించే అవకాశాలున్నాయి. గురువారం సాయంత్రం నాటికి కేరళలోకి రుతుపవనాలు విస్తరించే అవకాశాలున్నట్టు ఐఎండీ వెల్లడించింది. ఇటు బంగాళాఖాతంలోనూ రుతుపవనాల ప్రభావం కనిపిస్తున్నది. ఉపరితల ఆవర్తనాలు ఏర్పడుతున్నాయి. దీని ప్రభావంతో మన రాష్ట్రంలోనూ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఐఎండీ స్పష్టం చేసింది. ఈక్రమంలోనే గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ఇచ్చింది. మిగతా ఐదు రోజులకు రాష్ట్రం మొత్తానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తగ్గిన ఉష్ణోగ్రతలు..
మరోవైపు రాష్ట్రంలో వాతావరణం మారుతున్నది. ఉష్ణోగ్రతలు తగ్గాయి. 44 డిగ్రీలకన్నా తక్కువగానే నమోదవుతున్నాయి. అత్యధికంగా సూర్యాపేట జిల్లా ఉర్లుగొండలో 43.9 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది. భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, పెద్దపల్లి, జగిత్యాల, ఆసిఫాబాద్, మంచిర్యాల, నల్గొండ, హనుమకొండ, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోనూ 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, గద్వాల, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో 40 డిగ్రీలలోపే రికార్డయ్యాయి. హైదరాబాద్‌లోనూ టెంపరేచర్లు దిగొచ్చాయి. సిటీలో అత్యధికంగా బేగంపేట, చాంద్రాయణగుట్ట, ముషీరాబాద్, అంబర్‌పేట సర్కిళ్ల పరిధిలలో 40.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. మొత్తంగా 14 సర్కిళ్లలో 40 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు రికార్డ్ అయితే.. మిగతా 16 సర్కిళ్లలో 40 డిగ్రీలలోపే నమోదవడం గమనార్హం.
