రాష్ట్ర వ్యవసాయ మార్కెట్లు దెబ్బతిని, రైతులు పడుతున్న గోస వినిపించినంతకాలం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయం అసంపూర్ణంగానే ఉంటుంది. తెలంగాణ ఏర్పడినప్పటినుంచి రైతు గురించి రాజకీయ నాయకుల ఉపన్యాసాలు వింటూనే ఉన్నాం. రైతుబంధు, ఎత్తిపోతల పథకాలు, రైతుబీమా, రుణమాఫీ, విద్యుత్ సబ్సిడీ వంటివి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుకు పెడుతున్న కంటికి కనిపించే పెట్టుబడులు. అయితే, ఇవన్నీ భారీ పెట్టుబడులేకాని రైతుకు వ్యక్తిగతంగా చేరేది చిటికెడు మాత్రమే. రైతులు నిజంగా కోరేది తమ పంటలకు గిట్టుబాటు ధర. ఇది మాత్రమే వారికి నిజమైన ఆదాయం ఇస్తుంది. దాన్ని అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకాడుతున్నాయి. ‘తెలంగాణ రైజింగ్’ కేవలం రాజకీయ నినాదంగా మిగిలిపోకూడదు అనుకుంటే తెలంగాణ గ్రామీణులకు ఒక స్పష్టమైన అర్థాన్ని ఇవ్వాలి. 2047 వరకు ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికలలో వ్యవసాయం పట్ల విధానపరంగా స్తబ్ధత ఉన్నది. రైతు ఎక్కువ పండిస్తున్నాడు, కానీ అదనంగా ఏమీ సంపాదించడం లేదు.
రైతు పంటతో మార్కెట్‌కు చేరకముందే సమస్య మొదలవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గ్రామాలలో, రైతులు ఒకప్పుడు వరి, పప్పుధాన్యాలు ఆరబెట్టుకోవడానికి ఉపయోగించుకున్న ఖాళీ ప్రదేశాలు, చెరువుగట్లు, గ్రామ దారులు వంటి ఉమ్మడి ఆస్తులు క్రమంగా ఆక్రమణకు గురై ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారు. ధాన్యం ఆరబెట్టుకోవడానికి ఖాళీ ప్రదేశాలు లేకపోవడంతో, రైతులు తమ పంటను రోడ్లమీద ఆరబెడుతున్నారు. రోడ్డుమీద చెత్త అందులోకి చేరుతున్నాయి. వాహన ప్రమాదాలకు కూడా కారణం అవుతున్నాయి. దరిమిలా ధాన్యం తేమతో (ఎండబెట్టలేనిది) లేదా కలుషితమై (రోడ్ల మీద ఎండబెట్టినందుకు) కొనుగోలు కేంద్రాలకు చేరుతుంది. అక్కడ దానిని తిరస్కరిస్తారు లేదా నాణ్యత పేరు మీద ధర తగ్గిస్తారు. వ్యవసాయ మార్కెట్ల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, అరకొర మౌలిక సదుపాయాలవల్ల, విధాన వైఫల్యానికి రైతాంగం అన్యాయానికి గురవుతున్నది.
రైతులకు తప్పని కష్టాలు
ఈ మధ్య అధికంగా ఉపయోగిస్తున్న తేమ మీటర్లు రైతులకు అందుబాటులో లేవు. వాటిలో నమోదు చేసే నెంబర్లు, పద్ధతి రైతులకు అర్థం కావు. ఇందులో కూడా ‘చేతి వాటం’ ప్రదర్శిస్తారు. తూకంలో పారదర్శకత లేదు. మార్కెట్ ధరలు ప్రదర్శించరు. కమీషన్ ఏజెంట్లు కూడబలుక్కుని ధరలను నిర్ణయిస్తారు. చెప్పాపెట్టకుండా నిర్వహణ రుసుములను రైతుకు చేరాల్సిన సొమ్ముల నుంచి మినహాయిస్తారు.
రైతుకు ఇవ్వాల్సిన సొమ్ము కూడా ఆలస్యంగా ఇస్తారు. చెల్లింపు వారాల తరబడి ఆపుతారు. ప్రతి మనిషికి అవసరమైన ఆహారాన్ని పండించే రైతు, ఈ ప్రక్రియ చివరిలో, తన ప్రాంత మార్కెట్‌లో రైతులు దోపిడీకి గురవుతున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతున్నది. మార్కెట్లో కనీసంగా గుర్తించాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధర, కేవలం కాగితంపై ఉన్న ఒక వాగ్దానంగా మిగులుతున్నది. మొక్కజొన్నలు, పప్పుల సేకరణ గురించి ప్రభుత్వం ముందుగా ప్రకటించడం లేదు. పంటల దిగుబడి అధికంగా ఉన్నప్పుడు ప్రభుత్వం సేకరణ చేయదు. మార్కెట్లో ధర పడిపోవడానికి అధిక దిగుబడి కూడా కారణం అవుతోంది.
ఫ్యూచర్స్ ధరల హెచ్చుతగ్గులు
లక్షలాది మంది తెలంగాణ రైతులు ఆధారపడే కంది, వేరుశనగ, పత్తి, చిరుధాన్యాల వంటి పంటల విషయంలో, సంక్షోభ సంవత్సరాలలో కనీస మద్దతు ధరకి, వాస్తవ మార్కెట్ ధరకు మధ్య వ్యత్యాసం 20 నుంచి 40 శాతం వరకు ఉండవచ్చు. మార్కెట్ శక్తులకు పంటల ధర నిర్ణయించే ఇంకొక వేదిక ఉన్నది. ప్రతి పంట ధర ముంబైలోని కమోడిటీ ఎక్స్ఛేంజీలలో నిర్ణయిస్తారు.
అక్కడ సంస్థాగత వ్యాపారులు ఊహాజనిత నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాల వల్ల ఫ్యూచర్స్ ధరల హెచ్చుతగ్గులు సంభవిస్తాయి. చివరికి ఆ ధరలు క్రమంగా తగ్గి, రైతు మార్కెట్లో అందుకునే స్పాట్ ధరకు చేరుకుంటాయి. దరిమిలా తాను రూపొందించని, తెలియని, ప్రభావితం చేయలేని మార్కెట్‌లో రైతులు కేవలం ధరను స్వీకరించే వ్యక్తులుగా మిగిలిపోతున్నారు.
ప్రతి వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు, వ్యాపారుల నుంచి వసూలు చేసే మార్కెట్ సెస్సును మార్కెట్ మౌలిక సదుపాయాల కోసం కేటాయించాలి. దానికి బదులుగా, ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారు. తనకు ఏమాత్రం ఉపయోగపడని వ్యవస్థకు సగటు రైతు పన్ను చెల్లిస్తున్న పరిస్థితి దురదృష్టకరం. తెలంగాణలోని సుమారు 107 నియంత్రిత మార్కెట్ యార్డులు ఒక దశాబ్దం క్రితం ఎలా ఉండేవో చాలావరకు ఇప్పటికీ అట్లనే పనిచేస్తున్నాయి. గ్రేడింగ్ పరికరాలు లేవు. పరీక్షలు చేసే ప్రయోగశాలలు లేవు. కోల్డ్ స్టోరేజ్ లేదు. ఎలాంటి మౌలిక ప్రాసెసింగ్ సదుపాయాలు లేవు. రైతులు ముడిపంటతో వచ్చి, తక్కువ ధరలతోనే వెనుదిరుగుతారు.
వినియోగం, ఉత్పత్తిలో సమస్య
వ్యవసాయ ఉత్పత్తుల విపణి వ్యవస్థ వైఫల్యంలో దాదాపుగా ఎవరూ పట్టించుకోని ఒక కోణం ఉంది. నాణ్యమైన ఆహారం పొందే హక్కు ప్రతి వినియోగదారుడికి ఉన్నది. తెలంగాణ వ్యవసాయ మార్కెట్లలో వినియోగదారులకు తెలియాల్సిన సేంద్రియ, సంప్రదాయ ఉత్పత్తుల మధ్య అర్థవంతమైన వ్యత్యాసం గురించి సమాచారం లేదు. గ్రేడింగ్ సమాచారం లేదు. రైతుతో ప్రత్యక్ష సంబంధం లేదు.
హైదరాబాద్‌లో ధృవీకరించిన సేంద్రియ కూరగాయలు కొనాలనుకునే, లేదా తాను కొంటున్న ఉత్పత్తులను పరిశుభ్రంగా నిర్వహించి, నిజాయితీగా గ్రేడ్ చేశారో లేదో తెలుసుకోవాలనుకునే వినియోగదారుడికి అందుబాటులో ఎలాంటి సదుపాయం లేదు. సూటిగా చెప్పాలంటే ఇది ఒక మార్కెట్ వైఫల్యం. - కొనడానికి సిద్ధంగా ఉన్న కొనుగోలుదారు, అమ్మడానికి సిద్ధంగా ఉన్న అమ్మకందారు (రైతు) మధ్య వారధిగా కాకుండా అవరోధంగా ఉన్నది సంస్థాగత వ్యవస్థ. అయితే దీనికి పరిష్కారం లేకకాదు. సంకల్పం ఉంటే సరైన ప్రభుత్వ పెట్టుబడులు, విధానాల ద్వారా పరిస్థితిలో మార్పు తీసుకురావచ్చు.
రైతుల్లో అభద్రత
తెలంగాణ వ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థలు, పట్టణ పంచాయతీలు, పురపాలక సంఘాలు రైతులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదు. ఆ రైతు రోడ్డు పక్కన తన ఆహార ఉత్పత్తులను అమ్ముకోవాల్సి వస్తున్నది. ఇది చట్టవిరుద్ధం కాబట్టి నిరంతరం రైతులు అభద్రతా భావంతో ఉంటున్నారు. స్థలంకోసం లంచాలు ఇవ్వాలి, మామూళ్లు ఇవ్వాలి. ఇన్ని ఇబ్బందుల మధ్య అమ్ముకునే బదులు మార్కెట్లో మధ్య దళారులకు ఎంతో కొంత అమ్ముకుని, తొందరగా ఇంటికి చేరుతారు. రైతులకు స్థల నిరాకరణ పరిస్థితులు హైదరాబాద్‌కే పరిమితం కాదు.
వరంగల్, నిజామాబాద్, కరీంనగర్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పట్టణాలు, పెద్ద గ్రామాలల్లోనూ ఇదే రకమైన పరిస్థితి కొనసాగుతోంది. ఆహారయేతర వస్తువులకు మంచి షాపులు ఉండే ఆధునిక పట్టణాలలో ఆరోగ్యానికి, నిత్య జీవనానికి అవసరమైన ఆహార ఉత్పత్తులకు, పంటలకు మాత్రం స్థలం ఉండకపోవడం శోచనీయం. తెలంగాణలోని పట్టణ మాస్టర్ ప్లాన్‌లు వ్యవసాయ మార్కెట్ల కోసం భూమిని కేటాయించవు. నగరాలు విస్తరిస్తున్నకొద్దీ, ఈ లోపం ఇంకా ఎక్కువ అవుతుంది.
సంప్రదింపులతో సమస్యల పరిష్కారం
రైతులు ఎదుర్కొంటున్న సమస్యల వెనుక ప్రభుత్వ వ్యవస్థ, విధాన ప్రక్రియ వైఫల్యం ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల విపణి గొలుసుపై క్రమబద్ధమైన సంప్రదింపులు జరగలేదు. పంట కోత నుంచి దానికి వచ్చే నగదు చెల్లింపు వరకు ఒక రైతు ఎదుర్కొనే అనుభవాలపై సమగ్ర సర్వే జరగలేదు. సేంద్రియ రైతులు, గిరిజన అటవీ ఉత్పత్తులు సేకరించేవారు, మహిళా కూరగాయల వ్యాపారులు లేదా చిన్న పప్పుధాన్యాల రైతులు, ప్రభుత్వ వ్యవస్థలో తాము పడుతున్న అవస్థల గురించి చెప్పుకోవడానికి ఒక వేదిక లేదు.
ఇది కేవలం విధానపరమైన లోపం. దీని నుంచి బయటపడాలంటే సంప్రదింపులు చేస్తేనే మంచిది. రైతు ప్రతినిధులు, ఎఫ్‌పిఓ నాయకులు, మహిళా స్వయం సహాయక బృందాల సమాఖ్యలు, గిరిజన వర్గాల ప్రతినిధులతో కూడిన ఒక రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సలహా మండలిని సంప్రదింపుల అనంతరం సంస్థాగత రూపంలో ఏర్పాటు చేయాలి. ఒక రాష్ట్రం నిజంగా అభివృద్ధి చెందాలంటే రైతులు గౌరవంగా తమ పంటలను అమ్ముకోగలగాలి. వ్యవసాయ మార్కెట్ వ్యవస్థలో మార్పులకు ప్రభుత్వం నాంది పలకాలి.
- డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.

