V6 News

నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్.. రూ.9లక్షల విలువైన బంగారం అప్పగింత

నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్.. రూ.9లక్షల విలువైన బంగారం అప్పగింత

రోడ్డు వెళ్తుంటే పదిరూపాయల నోటు కనబడితే అటు ఇటు చూసి జేబులో పెట్టుకునే ప్రస్తుత సమాజంలో లక్షల విలువ జేసే బంగారం దొరికినా బాధితులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. ఆటో డ్రైవర్  నిజాయితీని మెచ్చుకొని పోలీసులు  అతనికి నగదు బహుమతి ఇచ్చి అభినందించిన ఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 

కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన సుజాత ఆర్ హిరేమఠ్ అనే మహిళ గురువారం (ఏప్రిల్ 23) తన నగలు పోయాయని సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గురువారం సాయంత్రం నార్సింగి నుంచి బిర్లా మందిర్ వరకు  TG11T1076 నంబర్ గల ఉబెర్ ఆటోలో ప్రయాణించానని, దిగిపోయిన తర్వాత బ్యాగ్ ను ఆటోలోనే మర్చిపోయినట్లు తెలిపింది. 

బ్యాగులో 6.5 తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ. 3వేల 500 ల నగదు  ఉన్నట్లు ఫిర్యాదులో తెలిపింది. ఉన్న బ్యాగ్ ను ఆటోలో మర్చిపోయింది. ఇంటికి వెళ్లి చూసుకొని ఆందోళనకు గురై సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను ఉబర్ ఆటోలో ప్రయాణించానని పోలీసులకు  తెలిపింది.

సైఫాబాద్ సిఐ సీతయ్య ఆదేశాల మేరకు కానిస్టేబుళ్లు కె. వినయ్ కుమార్  మదన్ మోహన్ లు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.  గంట వ్యవధిలో  సదరు ఆటోను, డ్రైవర్ ఫోన్ నంబర్‌ను గుర్తించారు. 

ఖైరతాబాద్, చింతల్ బస్తీకి చెందిన ఆటో డ్రైవర్ కె. నగేష్ ఫోన్ కాల్‌కు స్పందిస్తూ..బ్యాగ్ తన ఆటోలోనే సురక్షితంగా ఉందని తెలిపారు.వెంటనే పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బంగారం, నగదును పోలీసులకు అప్పగించారు. 

అనంతరం బంగారం , నగదు ఉన్న బ్యాగ్ ను సంబంధిత మహిళకు అందజేశారు.ఆటో డ్రైవర్ నగేష్ ప్రదర్శించిన నిజాయితీని సిఐ సీతయ్య అభినందిస్తూ, ఆయనకు నగదు బహుమతి అందజేశారు.