అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి షేర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అగ్రరాజ్యంలో కార్చిచ్చు రేపుతున్నాయి. ముఖ్యంగా భారతీయ, చైనా వలసదారులను అవమానిస్తూ చేసిన పోస్ట్‌పై హిందూ అమెరికన్ సంఘాలు, భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించాయి.
ట్రంప్ షేర్ చేసిన పోస్ట్‌ను విద్వేషపూరితమైన, జాత్యహంకార రాతలుగా అభివర్ణిస్తూ హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అమెరికా అధ్యక్షుడి హోదాలో ఉండి ఇలాంటి ద్వేషపూరిత వ్యాఖ్యలను సమర్థించడం వల్ల విదేశీయులపై దాడులు పెరిగే ప్రమాదం ఉందని వారు అన్నారు. అప్పటికే జాత్యహంకారం తారా స్థాయిలో ఉన్న తరుణంలో.. ఈ వ్యాఖ్యలు కమ్యూనిటీల సేఫ్టీని ప్రమాదంలో పడేస్తాయని ఆందోళన వ్యక్తం చేశాయి. వెంటనే ఆ పోస్ట్‌ను తొలగించి ట్రంప్ అమెరికా అభివృద్ధిలో ఆసియా దేశస్థుల కృషిని గుర్తించాలని డిమాండ్ చేశాయి.
We are deeply disturbed by @POTUS sharing this hateful, racist screed targeting Indian and Chinese Americans.
— Hindu American Foundation (@HinduAmerican) April 23, 2026
Endorsing such rants as the president of the United States will further stoke hatred and endanger our communities, at a time when xenophobia and racism are already at an… pic.twitter.com/3lq6YrE9CT
అసలు వివాదం అమెరికాకు చెందిన రాజకీయ విశ్లేషకుడు మైఖేల్ సావేజ్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ రీపోస్ట్ చేయటంతో స్టార్ట్ అయ్యింది. అందులో భారతీయులను, చైనీయులను ల్యాప్‌టాప్‌లు పట్టుకున్న గ్యాంగ్‌స్టర్లు అని, వారు అమెరికా జెండాను అవమానిస్తూ దేశాన్ని దోచుకుంటున్నారని ఉండటం వివాదానికి కారణం అయ్యింది. భారత్ దేశం నరక కూపం అంటూ సావేజ్ అభివర్ణించటాన్ని ప్రతి భారతీయుడూ తీవ్రంగా తప్పుపడుతున్నాడు.
ఈ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఘాటుగా స్పందించారు. ట్రంప్ షేర్ చేసిన అంశాలు "అసహ్యకరమైనవి, అవాస్తవమైనవి.. అత్యంత అనుచితమైనవి" అని తేల్చి చెప్పారు. భారత్-అమెరికా మధ్య ఉన్న సుదీర్ఘకాలపు పరస్పర గౌరవానికి ఈ వ్యాఖ్యలు ఏమాత్రం ప్రతిబింబం కావని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
డ్యామేజ్ కవరేజ్..
అటు సొంత దేశంలో హిందూ సంఘాల నుంచి.. ఇటు అంతర్జాతీయంగా భారత్ నుంచి వ్యతిరేకత రావడంతో ట్రంప్ వైఖరిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. స్నేహానికి విలువిచ్చే భారత్ వంటి దేశంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దౌత్యపరంగా పెద్ద తప్పిదమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియాలోని యూఎస్ ఎంబసీ డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నాలు స్టార్ట్ చేసినప్పటికీ ప్రజల నుంచి ట్రంప్ పై ఆగ్రహం పెరిగిపోతోంది.

