టెహ్రాన్: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌పై హౌతీ దళాల దాడి అనంతరం ఇరాన్ తన చరిత్రలోనే అత్యున్నత సైనిక సంసిద్ధత ప్రోటోకాల్ అయిన ‘కోడ్ 100’ను యాక్టివేట్ చేసినట్టు ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఐఆర్‌జీసీ, రెగ్యులర్ ఆర్మీ, వైమానిక రక్షణ విభాగాలు సహా దేశంలోని అన్ని సాయుధ దళాలు అత్యంత తీవ్రమైన యుద్ధ సన్నద్ధతలోకి వెళ్లాయి.
వెస్ట్రన్ కంట్రీస్ తరహాలోనే పూర్తి స్థాయి యుద్ధ సమీకరణకు సంకేతమైన ఈ ‘కోడ్ 100’ కింద ఇరాన్ కీలక రక్షణ చర్యలను వేగవంతం చేసింది. శత్రువుల ముందస్తు వైమానిక దాడుల నుంచి తప్పించుకునేందుకు భూగర్భ ‘క్షిపణి నగరాల్లోని’ మొబైల్ లాంచర్లను సెకండరీ పొజిషన్లకు తరలించడంతోపాటు రష్యా తయారీ ఎస్ -300, స్వదేశీ ఖోర్దాద్-15లాంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను హై-ఫ్రీక్వెన్సీ ట్రాకింగ్ మోడ్‌లోకి మార్చింది.
కేంద్ర కమాండ్‌తో సంబంధాలు తెగిపోయినా స్థానిక కమాండర్లే స్వతంత్రంగా ఎదురుదాడి జరిపే ‘మొజాయిక్ డిఫెన్స్’ అధికారాలను అమల్లోకి తెస్తూ, నటాంజ్, ఫోర్డోలాంటి కీలక అణు స్థావరాల చుట్టూ భద్రతా వలయాన్ని పటిష్టం చేసింది. ‘కోడ్ 100’ పేరుపై ఇరాన్ అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ.. క్షేత్రస్థాయిలో చోటుచేసుకుంటున్న దళాల కదలికలు రాబోయే ప్రత్యక్ష పోరుకు సూచికలని అంతర్జాతీయ రక్షణ రంగ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
