- రాష్ట్రవ్యాప్తంగా ప్రొహిబిటెడ్ లిస్ట్లోకి 41.94 కోట్ల చదరపు గజాల నాన్అగ్రికల్చర్ ల్యాండ్స్
- వివాదాల్లేని సొంత ఆస్తులనూ నిషేధ జాబితాలో చేర్చిన అధికారులు
- నోటీసులు ఇవ్వకుండానే లిస్ట్లోకి ఇండ్లు, ఓపెన్ ప్లాట్లు
- గ్రామకంఠ భూములకూ తప్పని తిప్పలు
- లబోదిబోమంటున్న సామాన్యులు.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
- అత్యవసర పరిస్థితుల్లో అమ్ముకోలేక తీవ్ర అవస్థలు
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల చట్టం సెక్షన్ 22-ఏ కింద నమోదైన నిషేధిత భూముల జాబితా అస్తవ్యస్తంగా మారింది. అధికారిక గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల కింద ఏకంగా 41.94 కోట్ల చదరపు గజాల వ్యవసాయేతర (నాన్-అగ్రి) భూములు నిషేధిత జాబితాలో చేరిపోయాయి. కేవలం ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, సీలింగ్, కోర్టు వివాదాల్లోని స్థలాలు మాత్రమే కాకుండా.. ఎలాంటి వివాదాలు లేని వేలాది ప్రైవేట్ పట్టా భూములు, ప్లాట్లను కూడా ఈ జాబితాలో చేర్చడం వివాదాస్పదమైంది.
అధికారుల నిర్వాకం వల్ల యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్ లాంటి హైదరాబాద్ పరిసర జిల్లాల్లో ఏండ్ల కిందే ఇళ్లు నిర్మించుకుని నివాసముంటున్న యజమానులు, ప్లాట్ల కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కారణాలు చూపకుండా చివరకు గ్రామకంఠం స్థలాల్లో, పట్టా భూముల్లో నిర్మించిన ఇళ్లను కూడా 22-ఏ జాబితాలో చేర్చడంతో బ్యాంకుల నుంచి రుణాలు రాక, అత్యవసరాలకు అమ్ముకోలేక సామాన్యులు లబోదిబోమంటున్నారు.
ఈ క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 22-ఏ(1)(బి) కేటగిరీలోనే 17.71 కోట్ల చదరపు గజాలు రాష్ట్రంలో నిషేధిత భూముల లెక్కలను పరిశీలిస్తే.. 22-ఏ(1)(బి) కేటగిరీ కింద నమోదైన భూములే ఎక్కువ ఉన్నాయి. ఈ ఒక్క విభాగం కింద ఏకంగా 17 కోట్ల 71లక్షల 41వేల 472 చదరపు గజాల నాన్-అగ్రికల్చర్ల్యాండ్రికార్డుల్లో నిలిచిపోయాయి. దీనికి అదనంగా ప్రభుత్వం, స్థానిక సంస్థల ఆస్తులను సూచించే కేటగిరీ కింద 1,01,63,425 చదరపు గజాల స్థలాలు నిలిచాయి.
ఈ రెండు కేటగిరీలను కలిపితే ఏకంగా 18.73 కోట్ల చదరపు గజాల మేర భూములు రిజిస్ట్రేషన్లకు దూరమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో తరాల తరబడి ఉన్న అసైన్డ్, భూదాన్ భూములకు సమీపంలో ఉన్న ప్రైవేట్, పట్టా జాగలను కూడా పరిశీలన లేకుండా రికార్డుల్లో నమోదు చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అలాగే పంచాయతీలు, మున్సిపాలిటీల సరిహద్దుల్లో అనుమతులు పొందిన లేఅవుట్లు, క్రమబద్ధీకరించిన ప్లాట్లను సైతం అధికారులు రీ-వెరిఫికేషన్ చేయకుండా నిషేధిత జాబితాలోనే చేర్చడంతో సామాన్య గృహ యజమానులు చిక్కుల్లో పడ్డారు.
మరో 6.15 కోట్ల చదరపు గజాలు ఇలా..
వివిధ ప్రభుత్వ ఏజెన్సీల దావాలు, కోర్టు వివాదాలు, ప్రభుత్వ నోటిఫికేషన్ల పరిధిలోని భూముల విస్తీర్ణం కూడా నిషేధిత జాబితాలో భారీగానే కనిపిస్తోంది. ప్రభుత్వం, కోర్టు వివాదాలకు సంబంధించిన 22-ఏ(1)(డి) కేటగిరీ కింద 3,07,93,772 చదరపు గజాల నాన్-అగ్రి స్థలాలు ఉండగా, కేంద్ర-, రాష్ట్ర ప్రభుత్వాల నోటిఫైడ్ భూముల విభాగం 22-ఏ(1)(ఈ) కింద కూడా సరిగ్గా అంతే స్థాయిలో మరో 3,07,93,772 చదరపు గజాల భూమి నమోదు కావడం గమనార్హం.
ఈ రెండు వర్గాల మొత్తం 6.15 కోట్ల చదరపు గజాలు నిషేధితం పరిధిలోకి వస్తోంది. దశాబ్దాల క్రితం నమోదై ముగిసిపోయిన పాత కోర్టు కేసులు, చెల్లుబాటు ముగిసిన నోటిఫికేషన్లను సైతం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల రికార్డుల నుంచి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయకపోవడం వల్ల ప్రైవేట్ ఆస్తులు కూడా ఆంక్షల చట్రంలో చిక్కుకుపోయాయి. దీంతో క్షేత్రస్థాయి పరిశీలన జరిపి లేటెస్ట్ లీగల్ స్టేటస్‌కు అనుగుణంగా జాబితాలను సవరించాల్సి ఉంది.
సీలింగ్ ఆంక్షల్లో 71.89 లక్షల చదరపు గజాలు
అర్బన్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ చట్టం కింద ఆంక్షల్లో ఉన్న నాన్-అగ్రి స్థలాలను ఈస్ట్, వెస్ట్ విభాగాలుగా విభజించి రికార్డు చేశారు. 22-ఏ(1)(సి) - ఈస్ట్ కేటగిరీ కింద 22,82,794 చదరపు గజాల నాన్-అగ్రి స్థలాలు, 22-ఏ(1)(సి) - వెస్ట్ కేటగిరీ కింద 49,06,505 చదరపు గజాల భూమి నమోదయ్యాయి. ఈ రెండింటి మొత్తం 71,89,299 చదరపు గజాలకు చేరింది.
వాస్తవానికి సీలింగ్ కేటగిరీల్లోని భూములలో అనేక చోట్ల దశాబ్దాల క్రితమే ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న కొనుగోలుదారులు ఉన్నారు. రికార్డుల్లో సమగ్ర సవరణలు జరగకపోవడంతో తరతరాలుగా ఉంటున్న నివాసాలు కూడా వివాదాస్పద భూములుగా మిగిలిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం అన్ని విభాగాలు కలిపి ఉన్న 41.94 కోట్ల చదరపు గజాల నిషేధిత నాన్-అగ్రి భూముల విస్తీర్ణాన్ని విశ్లేషిస్తే, రికార్డులలో నెలకొన్న వ్యత్యాసాలు ఎంతో స్పష్టంగా బయటపడుతున్నాయి.
సమస్యలకు నిలయంగా నిషేధిత జాబితా
రికార్డులు అస్తవ్యస్తంగా మారడంతో క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్ వంటి జిల్లాల్లో సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది. ఏండ్లుగా నివాసం ఉంటున్న నివాసాలు, నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన ప్లాట్లు కూడా ఒక్కసారిగా 22-ఏ జాబితాలో ప్రత్యక్షం కావడంతో యజమానులు ఆందోళన చెందుతున్నారు.
తమ సొంత ఆస్తులను అమ్ముకోలేక, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్య అత్యవసరాల కోసం బ్యాంకుల నుంచి రుణాలు పొందలేక లబోదిబోమంటున్నారు. చివరకు తరతరాలుగా వస్తున్న గ్రామకంఠం స్థలాలను, సర్వే నంబర్లలో సక్రమంగా ఇళ్లు కట్టుకున్న పట్టా భూములను సైతం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఈ నిషేధిత జాబితాలోకి చేర్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
భూములను రక్షించే ఉద్దేశంతో కాకుండా, కేవలం సాంకేతిక పొరపాట్లు, పాత డేటా నవీకరించకపోవడం వల్లే తమ ఆస్తులు నిషేధిత రికార్డుల్లోకి చేరాయని స్పష్టమవ్వడంతో తమ భూములను 22-ఏ జాబితా నుంచి వెంటనే తొలగించాలని కోరుతూ బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
