నైపుణ్యాభివృద్ధి, మెడికల్ టూరిజంలో తెలంగాణ-దక్షిణాఫ్రికా జోడీ

నైపుణ్యాభివృద్ధి, మెడికల్ టూరిజంలో తెలంగాణ-దక్షిణాఫ్రికా జోడీ
  •     ఆఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలేతో సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి భేటీ
  •     ఫ్యూచర్ సిటీ, నాలెడ్జ్ సిటీ  విశేషాలపై ఆఫ్రికా ప్రతినిధుల్లో ఆసక్తి
  •     డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో గ్లోబల్ సమిట్‌‌‌‌కు రావాలంటూ సీఎం ఆహ్వానం.. సానుకూల స్పందన 

హైదరాబాద్, వెలుగు: నైపుణ్యాభివృద్ధి, మెడికల్ టూరిజంసహా పలు కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని విస్తరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం, దక్షిణాఫ్రికా దేశాలు నిర్ణయించుకున్నాయి. భవిష్యత్తులో పరస్పర సహకారం అందించుకోవాలని సూత్రప్రాయంగా అంగీకరించాయి. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలే నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో  సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో విద్యా ప్రమాణాలు, నైపుణ్యాభివృద్ధి, మెడికల్ టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడులులాంటి రంగాల్లో ఉమ్మడి భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఇరు పక్షాలు సుదీర్ఘంగా చర్చించాయి. 

ఈ సమావేశంలో సీఎంతోపాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ నగర విశిష్టతలను దక్షిణాఫ్రికా ప్రతినిధులకు మంత్రులు, అధికారులు వివరించారు. ఐటీ, ఫార్మా, డిఫెన్స్​, ఏరోస్పేస్‌‌‌‌లాంటి రంగాలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేసి ప్రపంచానికి అందించేలా హైదరాబాద్ అభివృద్ధి చెందిన విషయాన్ని  ప్రస్తావించారు. ప్రపంచ ప్రఖ్యాత ఫార్చూన్- సహా 500 కంపెనీలు తమ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లను హైదరాబాద్‌‌‌‌లో ఏర్పాటు చేస్తున్నాయని వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాలు హైదరాబాద్‌‌‌‌ను నాలెడ్జ్ సిటీగా మార్చాయని  పేర్కొన్నారు.

గ్లోబల్ మెడికల్ టూరిజం కేంద్రంగా పురోగతి

వైద్య, ఆరోగ్య రంగంలో తెలంగాణ సాధించిన పురోగతిని ఈ భేటీలో ప్రముఖంగా ప్రస్తావించారు. తక్కువ ఖర్చుతో కూడిన అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో ఉండడంతో మిడిల్‌‌‌‌ ఈస్ట్‌‌‌‌ కంట్రీస్‌‌‌‌తోపాటు అనేక దేశాల ప్రజలు చికిత్స కోసం హైదరాబాద్‌‌‌‌కు వస్తున్నారని ప్రతినిధి బృందానికి వివరించారు. అత్యాధునిక ఆసుపత్రులు, నిపుణులైన వైద్యులు, మెరుగైన ఆరోగ్య మౌలిక వసతులు తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయన్నారు. హైదరాబాద్‌‌‌‌ను ప్రపంచ స్థాయి మెడికల్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ఈ రంగంలో దక్షిణాఫ్రికాతో కలిసి పనిచేసే అవకాశాలను పరిశీలించవచ్చని సూచించారు.

పరిశ్రమలకు అనుకూల వాతావరణం, వ్యాక్సిన్ల తయారీ

తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఉందని మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు వివరించారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పారదర్శక పారిశ్రామిక విధానాలు, వేగవంతమైన అనుమతుల వ్యవస్థ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయని పేర్కొంటూ, దక్షిణాఫ్రికా పారిశ్రామికవేత్తలు ఇక్కడి పెట్టుబడి అవకాశాలను పరిశీలించాలని కోరారు. బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్ల తయారీలో హైదరాబాద్‌‌‌‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ వివరించారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మెగా ఆసుపత్రులను నిర్మిస్తున్నామని, ఆరోగ్య రంగంలో తెలంగాణ-–దక్షిణాఫ్రికా భాగస్వామ్యం ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

భారత్‌‌‌‌తో దక్షిణాఫ్రికాది  చారిత్రక బంధం: పాల్‌‌‌‌ మషాటిలే

భార‌‌‌‌త‌‌‌‌దేశంతో దక్షిణాఫ్రికాది దశాబ్దాల నాటి చారిత్రక–  సాంస్కృతిక బంధ‌‌‌‌మ‌‌‌‌ని ఆ దేశ ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలే అన్నారు. ఆఫ్రికన్ కాంటినెంటల్ ఫ్రీ ట్రేడ్ ఏరియా ద్వారా భారత కంపెనీలు ఆఫ్రికా మార్కెట్లలోకి విస్తరించేందుకు దక్షిణాఫ్రికా ఒక కీలక వేదికగా నిలుస్తుందని చెప్పారు. ప్రత్యేకంగా ఫార్మా, ఆరోగ్య రంగాల్లో భారత కంపెనీలకు అక్కడ అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. 

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయని, భవిష్యత్తులో పరస్పర సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.  ఈ ఉన్నత స్థాయి స‌‌‌‌మావేశంలో దక్షిణాఫ్రికా అంతర్జాతీయ సంబంధాల ఉప మంత్రి మొరాకా, భారతదేశానికి దక్షిణాఫ్రికా రాయబారి ఏ. సూక్‌‌‌‌లాల్, ఆరోగ్య మంత్రి డాక్టర్ ఏ. మోట్సోలెడీ, సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి ఎస్. ఎండాబేని, విజ్ఞాన సాంకేతిక శాఖ ఉపమంత్రి ఎన్. గినా, కమ్యూనికేషన్స్, డిజిటల్ టెక్నాలజీ శాఖ ఉపమంత్రి ఎం. గుంగుబెలే పాల్గొన్నారు.

గ్లోబల్ సమిట్‌‌‌‌కు వచ్చేందుకు దక్షిణాఫ్రికా సుముఖత

నిరుడు నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్​ గ్లోబల్ సమిట్-2025’ భారీ విజయం సాధించిందని, దీని ద్వారా రాష్ట్రానికి కొత్త పెట్టుబడి అవకాశాలు లభించాయని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి గుర్తుచేశారు. ఈ ఏడాది డిసెంబర్‌‌‌‌లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్​ గ్లోబల్ సమిట్-2026’లో పాల్గొనాలని దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలేతోపాటు అక్కడి పారిశ్రామిక, వ్యాపారవేత్తలను ఆహ్వానించారు.  దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు సానుకూలంగా స్పందిస్తూ, పెద్ద సంఖ్యలో ప్రతినిధుల బృందంతో తాము ఈ సదస్సులో పాల్గొంటామని పేర్కొన్నారు. ఈ సదస్సు ద్వారా ఇరు దేశాల మధ్య వ్యాపార, పారిశ్రామిక సంబంధాలు మరింత బలపడతాయని అభిప్రాయపడ్డారు.