ఓ వైపు ఎండ.. ఇంకోవైపు వాన.. పలు జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత

ఓ వైపు ఎండ.. ఇంకోవైపు వాన.. పలు జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత

 

  • ఓ వైపు ఎండ.. ఇంకోవైపు వాన
  • పలు జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత
  • కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం
  • 4 రోజుల పాటు వానలు పడ్తాయన్న వాతావరణ శాఖ

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండుతుంటే.. కొన్ని జిల్లాల్లో ఉన్నట్టుండి వాతావరణం చల్లబడి వర్షం మోపైతున్నది. నాలుగైదు రోజులుగా ఇదే పరిస్థితి. ఎండ తీవ్రత వల్ల ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు.

గురువారం జగిత్యాల జిల్లా గోదూరులో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్​లో 44.1, ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 43.9, జగిత్యాల జిల్లా రాఘవపేటలో 43.8, ములుగు జిల్లా తాడ్వాయి, మంచిర్యాల జిలలా కొమ్మెరలో 43.3, ఆదిలాబాద్ జిల్లాలోని అర్లిటిలో 43.2, భోరజ్​లో 43.1, కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లా కెరమెరిలో 43.1, హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​లో  39.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కాగా.. ఆదిలాబాద్​, ఆసిఫాబాద్​, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్​, నిజామాబాద్​, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్​, వికారాబాద్​, పెద్దపల్లి జిల్లాల్లో పలు చోట్ల వర్షం పడింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్​ జిల్లా నేరడిగొండలో అత్యధికంగా 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాండూరు, మంచిర్యాలలో ఒక సెంటీమీటర్ చొప్పున వర్షం కురిసింది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడింది.

ఈ జిల్లాల్లో మరో 4 రోజులు వానలు

మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంపై ఆవరించిన ద్రోణి ప్రభావంతో మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది. ఉత్తర తెలంగాణలోని కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల మినహాయించి మిగతా అన్ని జిల్లాల్లోనూ వర్షపాతం నమోదయ్యే ఆస్కారం ఉందని పేర్కొంది. పలు చోట్ల ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది.