ఆదిలాబాద్, వెలుగు : 'ఏండ్లుగా కౌలు సాగు చేస్తున్నాం.. మాకంటూ ఎలాంటి గుర్తింపు లేదు.. కష్టపడి పంట పండించినప్పటికీ అమ్ముకునేందుకు తిప్పలు పడుతున్నం.. కనీసం ప్రభుత్వమైనా మాకు గుర్తింపుకార్డులు ఇవ్వాలి' అంటూ కౌలు రైతులు కోరారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 'తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ' సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బోథ్, నేరడిగొండ, తలమడుగు, తాంసీ, భీంపూర్, ఆదిలాబాద్ రూరల్, బేలా, సాత్నాల, బోరజ్, గుడిహత్నూర్ నుంచి కౌలు రైతులతో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలువురు కౌలు రైతులు మాట్లాడుతూ 2011 చట్టం ప్రకారం తమకు గుర్తింపు కార్డులు ఇచ్చి, సబ్సిడీలు, పథకాలు అందించాలని కోరారు. పట్టాదారుతో సంబంధం లేకుండా అధికారులే కౌలు రైతులను గుర్తించాలని, తమకు ఫసల్ భీమా, రైతు బీమా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ కౌలు రైతులను గుర్తించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
ఆగస్టు లో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కౌలు రైతుల సమస్యలను లేవనెత్తుతానని హామీ ఇచ్చారు. స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకుడు విస్సా కిరణ్ కుమార్ 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూ అధీకృత సాగుదారుల చట్టం ప్రకారం కౌలు సాగుదారులకు ప్రతి సంవత్సరం గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు.
సమావేశంలో సాధన కమిటీ నాయకులు కొండల్ రెడ్డి, శ్రీహర్ష, మహిత, ప్రణీత, సంగెపు బొర్రన్న, ఎం.రమాకాంత్, ఎ.రాకేశ్, షారూఖ్, గెల్ల మల్లేశ్, బింగి తిరుపతి, తెలంగాణ రైతు సంఘం నాయకులు బండి దత్తాత్రేయ, అఖిల పక్ష రైతు సంఘం నాయకులు కొండ రమేశ్, పోశెట్టి, దళిత శక్తి ప్రోగ్రామ్ రాష్ట్ర కన్వీనర్ అగ్గిమల గణేశ్ పాల్గొన్నారు.
