ఎల్బీనగర్ కాంగ్రెస్లో లొల్లి..యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి ఇంటి ముట్టడి

ఎల్బీనగర్ కాంగ్రెస్లో లొల్లి..యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి ఇంటి ముట్టడి

 

  • గుట్ట ఆలయ బోర్డు మెంబర్ ఈశ్వరమ్మ యాదవ్​పై 
  • అనుచిత వ్యాఖ్యలకు నిరసన
  • రాళ్లు, కర్రలతో పరస్పర దాడి.. పలువురికి గాయాలు 
  • కులాలను కించపర్చడమంటే పార్టీ లైన్‌‌‌‌ను అతిక్రమించడమే: మధు యాష్కీ

హైదరాబాద్, వెలుగు: యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్‌‌‌‌పై.. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు  చేశాడంటూ, సోమవారం ఆమె అనుచరులు, బీసీ సంఘాల నాయకులు మన్సూరాబాద్‌‌‌‌లోని ఆయన ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల కార్యకర్తలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో శివ చరణ్ రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసం అయ్యాయి.

పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. అంతకు ముందు ఈశ్వరమ్మ అనుచరులు, బీసీ సంఘాలు ఎల్బీనగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి శివచరణ్ రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలు చేస్తూ ఆయన దిష్టి బొమ్మను తగులబెట్టారు. అతన్ని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతటితో ఆగని ఆమె అనుచరుల, బీసీ సంఘాల కార్యకర్తలు అక్కడి నుంచి నేరుగా శివచరణ్ రెడ్డి ఇంటిని ముట్టడించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

దురదృష్టకర ఘటన

ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఇద్దరు కీలక నేతలు ఇలా రోడ్డున పడడం అధికార పార్టీలో కలకలం సృష్టించింది. ఈ వర్గపోరు ఇప్పుడు పీసీసీ దృష్టికి వెళ్లింది. దీనిపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు  చల్లా నర్సింహా రెడ్డిని ఈ ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు ఎల్బీ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌‌‌‌చార్జి మధుయాష్కీగౌడ్ స్పందించారు.

ఈ ఘటన ఆందోళనకరమని, దీన్ని పీసీసీ, ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేసి, బీసీ వర్గాల మద్దతు పొందుతున్న సమయంలో పార్టీలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. రెండు బీసీ ముఖ్య కులాలను కించపరిచే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, దీనిపై పార్టీయే సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. 

అసలు వివాదానికి ఇది కారణం

ఈశ్వరమ్మ యాదగిరి గుట్ట బోర్డు మెంబర్‌‌‌‌‌‌‌‌గా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఆమె అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో శివ చరణ్ రెడ్డి తండ్రి అయిన సీనియర్ కాంగ్రెస్ నేత ప్రభాకర్ రెడ్డి ఫొటో లేదు. దీంతో తన తండ్రి ఫొటో ఎందుకు పెట్టలేదంటూ.. ఆయన ఈశ్వరమ్మ కుటుంబ సభ్యుడు ఒకరికి ఫోన్ చేసి దురుసుగా మాట్లాడిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈశ్వరమ్మ అనుచరులు, బీసీ సంఘాలు ఆయన మాటల తీరుకు తీవ్ర మనస్తాపం చెంది, సోమవారం ఆందోళనకు దిగడంతో.. వర్గపోరు రోడ్డెక్కింది.