అలియాబాద్లో ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య లొల్లి

అలియాబాద్లో ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య లొల్లి

శామీర్​పేట, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలోని లాల్​గాడి మలక్​పేటలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్​యాదవ్ అనుచరుల మధ్య ఘర్షణ జరిగింది. వివరాల్లోకి వెళ్తే..  స్థానిక కార్యకర్త శ్రీనివాస్​రెడ్డి ఇంట్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి శుక్రవారం బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సమయంలో కాంగ్రెస్ ప్రచార రథం ఆ ఇంటి ముందు నుంచి సౌండ్ పెట్టి వెళ్లడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. క్రమేణా ఇది ఘర్షణకు దారి తీసింది. బీఆర్ఎస్ అభ్యర్థి ఇంట్లోకి డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్​యాదవ్, కార్యకర్తలతో దూసుకెళ్లగా, పోలీసులు అడ్డుకొని గేటు బయటకు పంపించారు. ఈ ఘర్షణలో మల్లారెడ్డి కారు అద్దాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి.

బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటి ఎదుట వజ్రేశ్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి హరివర్దన్ రెడ్డి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాలు హోరాహోరీగా నినాదాలు చేసుకోగా, పోలీసులు వారిని చెదరగొట్టారు. తర్వాత మల్లారెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసిజినోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్‌‌‌‌లో ఫిర్యాదు చేయగా, కాంగ్రెస్ నాయకులు కూడా మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు రెండు వైపులా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జూబ్లీహిల్స్ లోనూ బాహాబాహీ

జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ వెంగళరావు నగర్​లోని జవహర్ నగర్​లో శుక్రవారం డ్రైనేజీ పనుల శంకుస్థాపన సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ జేసీబీ ముందు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించి వెళ్లిపోగా, ఆ తర్వాత చేరుకున్న స్థానిక కార్పొరేటర్ దేదీప్య రావు తనను పిలవకుండా శంకుస్థాపన ఎలా చేస్తారని ప్రశ్నించారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్త రూపాపై బీఆర్ఎస్ మహిళా నాయకురాలు చేయి చేసుకోవడంతో ఉద్రిక్తత పెరిగింది. వెంటనే కాంగ్రెస్ వర్గీయులు చేరుకోవడంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగారు. దీంతో ఇరువైపులా కార్యకర్తలకు గాయాలయ్యాయి. అనంతరం ఇరువురి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.