- సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన సంస్థ
- మంత్రి శ్రీధర్‌బాబుతో టెస్లా సంస్థ ఇండియా ప్రతినిధుల భేటీ
హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజ సంస్థ టెస్లా త్వరలో హైదరాబాద్‌లో సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది. శుక్రవారం ఆ సంస్థ ఇండియా ప్రతినిధులు సెక్రటేరియెట్‌లో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. తాము ఇక్కడ అమ్మకాలు ప్రారంభించేందుకు సిద్ధమని మంత్రికి వివరించారు. ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇంటెలిజెంట్ మొబిలిటీ వ్యవస్థలకు అవసరమైన అత్యాధునిక సాంకేతికతలతో కూడిన ఎకోసిస్టంను తెలంగాణలో అభివృద్ధి చేసినట్టు సంస్థ ప్రతినిధులకు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సెమీ కండక్టర్ డిజైన్, ఆటోమొబైల్ సాఫ్ట్ వేర్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, డీప్ టెక్నాలజీ రంగాలకు ప్రధాన కేంద్రంగా రాష్ట్రం ఎదిగిందని చెప్పారు. హైదరాబాద్‌లో టెస్లా ఈవీ సేల్స్, సర్వీసు సెంటర్లను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన టెస్లా ఇండియా జనరల్ మేనేజర్ శరద్ అగర్వాల్, లీడ్ పబ్లిక్ పాలసీ, బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ రజత్‌ను శ్రీధర్ బాబు ప్రత్యేకంగా అభినందించారు. టెస్లా ఇప్పటి వరకు దేశంలో 4 సేల్స్ షోరూంలను ఏర్పాటు చేయగా.. తదుపరి కేంద్రంగా హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. టెస్లా కేవలం ఈవీ కంపెనీ మాత్రమే కాదని, ఎలక్ట్రిక్ వాహనాల సాఫ్ట్‌వేర్, సెమీ కండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, బ్యాటరీ టెక్నాలజీలు, అధునాతన తయారీ రంగాల్లో నూతన ఆవిష్కరణలను పరిచయం చేసిన సంస్థగా ఎదిగిందని మంత్రి పేర్కొన్నారు. టెస్లా దీర్ఘకాలిక సాంకేతిక లక్ష్యాలకు తెలంగాణలో ఉన్న ఎకోసిస్టం బాగా సరిపోతుందని ఆయన తెలిపారు. నగరంలో ఉన్న సెమీకండక్టర్ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా నెక్ట్స్ జనరేషన్ ఎలక్ట్రిక్, స్మార్ట్ మొబిలిటీ వ్యవస్థలకు అవసరమైన చిప్స్, సెన్సార్ల అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తున్నాయని తెలిపారు.
ఈవీ సెక్టార్‌లో మంచి అవకాశాలు
దేశంలో ప్రస్తుతం కార్ల మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటా సుమారు 4 శాతం మాత్రమే ఉందని, ఈ రంగంలో భారీ అవకాశాలు ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంతోపాటు హైదరాబాద్‌ను క్లీన్ టెక్నాలజీ, ఆధునిక మొబిలిటీకి ప్రపంచస్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసే సంకల్పంతో ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో టెస్లాకు సంబంధించిన అనుబంధ పరిశ్రమల విస్తరణ అవకాశాలను పరిశీలించాలని టెస్లా ప్రతినిధులను కోరారు. పరిశ్రమలు, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ, టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, ప్రత్యేక కార్యదర్శి రఘురామ శర్మ తదితరులు పాల్గొన్నారు.
డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో తెలంగాణను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం
డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పౌర సేవలను మరింత పారదర్శకంగా ప్రజలకు చేర్చేలా సమగ్రమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఆధ్వర్యంలో శుక్రవారం నోవాటెల్ హెచ్ఐసీసీలో ‘డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫైనాన్స్ సమ్మిట్ – 2026’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం గ్లోబల్ ఎకానమీ ఊహించని వేగంతో డిజిటల్ వైపు దూసుకుపోతోందన్నారు. సంప్రదాయ పద్ధతుల స్థానంలో వ్యవస్థను రీ-డిఫైన్ చేసే సరికొత్త డిజిటల్ ఈక్వేషన్స్ తెరపైకి వచ్చాయని పేర్కొన్నారు. ఈ గ్లోబల్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు అనుగుణంగా మార్పులను అందిపుచ్చుకునే దేశాలకే భవిష్యత్ ఉంటుందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచిందని కొనియాడారు.
ఆ మూడింటిని నడిపించే ఎకోసిస్టమ్..
భావితరాల అవసరాలకు అనుగుణంగా నెక్ట్స్ జనరేషన్ ఇన్నొవేషన్స్, ట్యాలెంట్, ఎకనామిక్ గ్రోత్.. ఈ మూడింటిని నడిపించే ఒక బలమైన ఎకోసిస్టమ్‌ను ఇప్పటి నుంచే అభివృద్ధి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 2047 నాటికి దేశ జీడీపీలో మన రాష్ట్ర వాటాను 10 శాతానికి చేర్చాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఒకప్పుడు కేవలం సంప్రదాయ బుక్ కీపింగ్, అకౌంట్స్ ఆడిటింగ్‌కే పరిమితమైన సీఏలు.. నేడు కార్పొరేట్ సంస్థలకు ‘స్ట్రాటజిక్ బిజినెస్ అడ్వైజర్స్’గా రూపాంతరం చెందారని తెలిపారు. మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్‌లపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీ అండ్ ఏజీ ఆనంద్ మోహన్ బజాజ్, సెర్ట్-ఇన్ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ సోలంకి, ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ రాజగోపాల్ శర్మ, సెబీ సీజీఎం సాహిల్ మాలిక్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
