డీఈఈసెట్లో 84.36%  క్వాలిఫై

డీఈఈసెట్లో 84.36%  క్వాలిఫై
  • అభ్యర్థులు 6 నుంచి వెబ్ ​ఆప్షన్లు ఇవ్వాలి
  • 2 నుంచి సర్టిఫికెట్​ వెరిఫికేషన్ : సెట్ కన్వీనర్ రమేశ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డీఈడీ, డీపీఎస్ఈ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీజీ డీఈఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్ సీఈఆర్టీ డైరెక్టర్, సెట్ కన్వీనర్ జి.రమేశ్​శనివారం హైదరాబాద్​లోని తన ఆఫీస్​లో రిలీజ్ చేశారు. ఈ ఏడాది ఎంట్రన్స్ టెస్టుకు 32,592 మంది దరఖాస్తు చేసుకోగా 25,054 మంది హాజరయ్యారని తెలిపారు. వీరిలో 21,137 మంది (84.36 శాతం) క్వాలిఫై అయినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌‌‌‌సైట్ deecet.cdse.telangana.gov.in నుంచి డౌన్‌‌‌‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

ఇంగ్లిష్ మీడియంలో 14,414 మందికి 12,784 మంది (88.69 శాతం), తెలుగు మీడియంలో 9,612 మందికి 7,918 మంది (82.37 శాతం), ఉర్దూ మీడియంలో 1,028 మందికి 435 (42.31 శాతం) మంది పాసయ్యారని చెప్పారు. మొత్తం 20,482 మంది అమ్మాయిలు పరీక్ష రాయగా.. 16,984 మంది, అబ్బాయిలు 4,572 మందికి 4,135 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఓసీ, బీసీ అభ్యర్థులకు క్వాలిఫై మార్కులు 35 కాగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు లేవు.

ఉమ్మడి జిల్లాల్లో వెరిఫికేషన్​

జూన్ 2 నుంచి 5వరకు పాత 10 జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ డైట్ కాలేజీల్లో సర్టిఫికెట్​వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు సెట్​కన్వీనర్​ తెలిపారు. వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న వారు జూన్ 6 నుంచి 8వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలన్నారు.  

టాపర్లు వీరే..

ఇంగ్లిష్​ మీడియంలో జె.శివకుమార్(83 మార్కులు, జగిత్యాల), తెలుగు మీడియంలో బి.ఆనంద్ (76 మార్కులు, గద్వాల), ఉర్దూ మీడియంలో డానిష్ ​అహ్మద్(66 మార్కులు, ఆదిలాబాద్) టాపర్లుగా నిలిచారు.