హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో నిర్వహిస్తున్న టీజీ ఈఏపీసెట్ 2026 ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు రెండో రోజు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్షలకు విద్యార్థుల నుంచి భారీ స్పందన లభించింది. రెండు సెషన్లలో కలిపి సగటున 93 శాతానికి పైగా అభ్యర్థులు హాజరయ్యారని కన్వీనర్ ప్రొఫెసర్ కె. విజయకుమార్ రెడ్డి వెల్లడించారు. ఉదయం సెషన్‌లో 35,092 మంది విద్యార్థులకు గానూ 32,673 మంది (93.11%) పరీక్ష రాయగా, మధ్యాహ్నం సెషన్‌లో 35,518 మందికి గానూ 33,225 మంది (93.54%) హాజరయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా జోన్ల వారీగా చూస్తే నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండ ప్రాంతాల్లో అత్యధికంగా 98 శాతం హాజరు నమోదు కాగా, ఆదిలాబాద్ జోన్లో అత్యల్పంగా 88 శాతం నమోదైందని చెప్పారు. పరీక్షల నిర్వహణ తీరును ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి మహబూబ్ నగర్ లోని ఒక కేంద్రాన్ని సందర్శించి స్వయంగా పరిశీలించారు. జేఎన్టీయూహెచ్ నుంచి వర్సిటీ వీసీ కిషన్ కుమార్ రెడ్డి, కన్వీనర్ విజయకుమార్ రెడ్డి ఇతర అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థుల వివరాలను సేకరించడంతో పాటు, నిఘాను కట్టుదిట్టం చేసి పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
