హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీజీ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. సోమవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన నేతృత్వంలో తేదీలను ఖరారు చేశారు. ఐసెట్ ఫస్ట్ షెడ్యూల్‌లో జులై 31 నుంచి ఆగస్టు 5 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో బేసిక్ ఇన్ఫర్మేషన్ నమోదు చేసి, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి.
ఆగస్టు1 నుంచి 5 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అనంతరం ఆగస్టు 3 నుంచి 8 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఆగస్టు11న అభ్యర్థులకు తొలి విడత సీట్లను కేటాయిస్తారు. 11 నుంచి 14 లోపు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, ట్యూషన్ ఫీజు చెల్లించాలి. తొలి విడతలో సీట్లు రాని వారు, రిజిస్ట్రేషన్ చేసుకోని వారు ఆగస్టు 17 నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. 18న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 19 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఆగస్టు 22న ఫైనల్ ఫేజ్ సీట్లను కేటాయిస్తారు.
