హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎంఈ, ఎంటెక్, ఎం.ఫార్మసీ, ఎం.ఆర్క్, ఫార్మ్-డీ వంటి పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ పీజీఈసెట్ ప్రవేశ పరీక్షలు సోమవారంతో ముగిశాయి. మే 29న ప్రారంభమైన ఈ పరీక్షలు 4 రోజులపాటు.. ప్రతిరోజూ రెండు సెషన్లలో జరిగాయి. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26,077 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 23,637 మంది (90.64 శాతం) పరీక్షకు హాజరయ్యారు.
హైదరాబాద్ రీజియన్‌లో 21,473 మందికి 19,384 మంది, వరంగల్ రీజియన్‌లో 4,604 మందికి 4,253 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. చివరి రోజున ఉదయం సెషన్‌లో జియో ఇంజినీరింగ్, ఫార్మసీ.. మధ్యాహ్నం సెషన్‌లో సివిల్, ఎలక్ట్రికల్, ఫుడ్ టెక్నాలజీ, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగాలకు పరీక్షలు నిర్వహించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ కె.వెంకటేశ్వరరావు తెలిపారు.
