- ఐదు రోజుల పాటు 10 సెషన్లలో నిర్వహణ
- షెడ్యూల్ విడుదల చేసిన ఎస్సీఈఆర్టీ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను విద్యా శాఖ విడుదల చేసింది. జూన్ 16 నుంచి 22 వరకు ఆన్‌లైన్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మొత్తం ఐదు రోజుల పాటు 10 సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. అభ్యర్థుల సంఖ్య, వారు ఎంచుకున్న సబ్జెక్టుల ఆధారంగా జిల్లాల వారీగా ఈ షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు చెప్పారు. రోజుకు రెండు సెషన్లు.. పరీక్షలను ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. సెషన్-1 ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, సెషన్-2 మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు ఉంటుంది. పరీక్షా కేంద్రాలు, జిల్లాల వారీగా కేటాయింపులకు సంబంధించి పూర్తి వివరాలు https://schooledu.telangana.gov.inలో చూసుకోవాలని అధికారులు సూచించారు. జూన్ 22న జరిగే మైనర్ లాంగ్వేజ్ పరీక్షలు అన్ని జిల్లాల అభ్యర్థులకు కలిపి నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
పేపర్ల వారీగా షెడ్యూల్ ఇలా..
జూన్ 16: మొదటి, రెండో సెషన్లలో పేపర్-1 (ఇంగ్లీష్/తెలుగు మీడియం)
జూన్ 17: ఉదయం పేపర్-1, మధ్యాహ్నం సెషన్‌లో పేపర్-2 (మ్యాథ్స్ అండ్ సైన్స్)
జూన్ 18: రెండు సెషన్లలోనూ పేపర్-2 (మ్యాథ్స్ అండ్ సైన్స్)
జూన్ 19: రెండు సెషన్లలో పేపర్-2 (సోషల్ స్టడీస్)
జూన్ 22: ఉదయం మైనర్ లాంగ్వేజెస్ (హిందీ, ఉర్దూ, కన్నడ తదితర) వారికి పేపర్-2, మధ్యాహ్నం మైనర్ లాంగ్వేజ్ అభ్యర్థులకు పేపర్-1
