ఫిబ్రవరి 25 లోగా ఓటీఆర్ అప్డేట్ చేసుకోవాల్సిందే : టీజీపీఎస్సీ

ఫిబ్రవరి  25 లోగా ఓటీఆర్ అప్డేట్ చేసుకోవాల్సిందే : టీజీపీఎస్సీ
  •   లేకుంటే జాబుల అప్లైకి అనర్హులవుతారు: టీజీపీఎస్సీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని నిరుద్యోగులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) డేటాను తప్పనిసరిగా అప్‌‌డేట్ చేసుకోవాలని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఎవరైతే తమ ఓటీఆర్ వివరాలను అప్‌‌డేట్ చేసుకోరో.. వారు రాబోయే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లకు అప్లై చేసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. వాస్తవానికి ఈ గడువు ఈ నెల9తో ముగియాల్సి ఉండగా, అభ్యర్థుల సౌకర్యార్థం 25వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం సోమవారం ఓ  ప్రకటనలో వెల్లడించారు.

భవిష్యత్తులో విడుదలయ్యే అన్ని నోటిఫికేషన్లు, అప్లికేషన్లు, ఫలితాలు, తుది ఎంపికలు కేవలం ఓటీఆర్ లో ఉన్న డేటా ఆధారంగానే జరుగుతాయన్నారు. ఇటీవల జరిగిన ఎస్సీ వర్గీకరణ మార్పులు, అభ్యర్థుల విద్యా అర్హతల్లో మార్పులు, వివరాల సవరణకు వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వ్యక్తిగత, విద్య, కేటగిరీ వివరాలను సరిచూసుకోవాలని సూచించారు.

అదనపు అర్హత కలిగిన అన్ని విద్యార్హతలను అప్‌‌డేట్ చేయాలన్నారు. అన్ని సంబంధిత సర్టిఫికెట్లు, కొత్త కలర్ పాస్‌‌పోర్ట్ సైజ్ ఫొటోను అప్‌‌లోడ్ చేయాల్సి ఉంటుందని వివరించారు. గడువులోపు వన్ టైం రిజిస్ట్రేషన్ డేటాను అప్‌‌డేట్ చేయని అభ్యర్థులు త్వరలో రాబోయే రిక్రూట్‌‌మెంట్ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులవుతారని హెచ్చరించారు. వివరాలను అధికారిక వెబ్‌‌సైట్ https://www.tgpsc.gov.in ద్వారా అప్‌‌డేట్ చేసుకోవాలని బుర్రా వెంకటేశం సూచించారు.