ఈ నెలలోనే ఆరు నోటిఫికేషన్లు ...నేడు 3 ఉద్యోగ ప్రకటనలు రిలీజ్‌‌‌‌‌‌‌‌ : టీజీపీఎస్సీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ బుర్రా వెంకటేశం

ఈ నెలలోనే ఆరు నోటిఫికేషన్లు ...నేడు 3 ఉద్యోగ ప్రకటనలు రిలీజ్‌‌‌‌‌‌‌‌ : టీజీపీఎస్సీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ బుర్రా వెంకటేశం
  • ఈ నెలలోనే ఆరు నోటిఫికేషన్లు నేడు 3 ఉద్యోగ ప్రకటనలు రిలీజ్‌‌‌‌‌‌‌‌
  • టీజీపీఎస్సీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ బుర్రా వెంకటేశం వెల్లడి
  • ఏడాదిలోనే ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి 
  • సింగిల్ ఎగ్జామ్ అయితే 6 నెలల్లోనే కంప్లీట్‌‌‌‌‌‌‌‌ చేస్తం
  • 35 శాఖల్లో 3,800 పోస్టుల భర్తీకి సర్కారు ఓకే
  • రాబోయే నోటిఫికేషన్లలో అత్యధికంగా 1,393 ఎఫ్‌‌‌‌‌‌‌‌బీవో పోస్టులు
  • ఇక సీబీటీ విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తం
  • కమిషన్‌‌‌‌‌‌‌‌పై తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తామని వార్నింగ్‌‌‌‌‌‌‌‌


హైదరాబాద్, వెలుగు:  ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ  వేగం పెంచింది. ఈ నెలలోనే  5 నుంచి 6 జాబ్‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు కమిషన్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ బుర్రా వెంకటేశం వెల్లడించారు. మంగళవారం 3 నోటిఫికేషన్లు  ఇస్తామని వెల్లడించారు. ఆర్​ అండ్ బీలో ఏఈఈతోపాటు పొల్యుషన్ బోర్డులోనూ ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌మెంటల్‌‌‌‌‌‌‌‌ విభాగంలో పోస్టులు ఉంటాయన్నారు. సోమవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని టీజీపీఎస్సీ  కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బుర్రా వెంకటేశం వివరాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 35 శాఖల్లో ఖాళీగా ఉన్న 3,800 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని, వాటిని దశలవారీగా భర్తీ చేస్తామని తెలిపారు. డిప్యూటీ డీఈవో, డైట్ లెక్చరర్లు, ఏఎస్‌‌‌‌‌‌‌‌ఓ తదితర పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. దేవాదాయశాఖలో పోస్టుల భర్తీకి కొంత సమయం పడుతుందని తెలిపారు. త్వరలో రాబోయే నోటిఫికేషన్లలో అత్యధికంగా 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఉండనున్నాయని  చెప్పారు. సుమారు 20, 25 రకాల ఒకటీ, రెండు పోస్టులను కలిపి గ్రూప్ నోటిఫికేషన్లుగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. డిప్యూటీ డీఈఓ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించబోమని, కేవలం డిగ్రీ లెక్చరర్ పోస్టులకు మాత్రమే ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. 

గతంలో నియామక ప్రక్రియ ఏళ్ల తరబడి సాగడంతో అభ్యర్థులు నష్టపోయారని, ఇకపై ఆ పరిస్థితి ఉండబోదని బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. ‘‘ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఏడాదిలోపు నియామక ప్రక్రియ పూర్తి చేయాలన్నది మా టార్గెట్. ప్రిలిమ్స్, మెయిన్స్ లేని సింగిల్ పరీక్షల ప్రక్రియను కేవలం 3 నుంచి 6 నెలల్లోనే కంప్లీట్‌‌‌‌ చేస్తం.  ఒకవేళ మెయిన్స్ ఉంటే గరిష్టంగా 9 నెలల నుంచి ఏడాది సమయం పడుతుంది” అని వెల్లడించారు.  దీంతోపాటు యూపీఎస్సీ తరహాలోనే అభ్యర్థులకు మార్గనిర్దేశం చేసేందుకు ‘ప్రతిభా భారతి’ అనే పోర్టల్‌‌‌‌ను రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు.


ఇకపై అన్నీ ఆన్‌‌‌‌లైన్ పరీక్షలే..


పేపర్ లీకేజీలకు తావులేకుండా ఇకపై టీజీపీఎస్సీ నిర్వహించే 90 శాతం పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ మోడ్ (సీబీటీ) లోనే ఉంటాయని బుర్రా వెంకటేశం తెలిపారు. ఓఎంఆర్ షీట్ల ప్రింటింగ్, రవాణా, భద్రతలాంటి అంశాల్లో జాప్యం జరుగుతోందన్నారు. సీబీటీ విధానంలో పరీక్షకు కొన్ని గంటల ముందే ప్రశ్నాపత్రం సిద్ధం చేసే వీలుంటుందనీ,ఉదాహరణకు ఉదయం 9 గంటలకు పరీక్ష ఉంటే.. ఏడు గంటలకే పేపర్ సెట్ చేయవచ్చని, దీంతో లీకేజీలకు అవకాశమే ఉండబోదని వెల్లడించారు. ప్రశ్నల తయారీలోనూ ఒక ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌కు.. మరో ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌కు సంబంధం లేకుండా రహస్యంగా నిర్వహించొచ్చన్నారు. ఇక పరీక్ష పూర్తయిన వెంటనే అభ్యర్థి ఎన్ని ప్రశ్నలకు కరెక్ట్ గా సమాధానం ఇచ్చారో స్క్రీన్ పైనే చూసుకునే వెసులుబాటు కల్పిస్తామని వివరించారు.  నిరుద్యోగులు ఈ మార్పులకు తగ్గట్టుగా సిద్ధం కావాలని, ముఖ్యంగా కంప్యూటర్ వాడకంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. 
 ఓటీఆర్ అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేసుకోవాలి..


అభ్యర్థులంతా తమ వన్‌‌‌‌ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) వివరాలను వెంటనే అప్‌‌‌‌డేట్ చేసుకోవాలని, దీంతో సర్టిఫికెట్ వెరిఫికేషన్ సులభం అవుతుందని బుర్రా వెంకటేశం  తెలిపారు. రాష్ట్రంలో 32 లక్షలమంది ఓటీఆర్​ రిజిస్టర్ చేసుకున్నారనీ, దీనిలో చాలామంది అప్‌‌‌‌డేట్ చేసుకోలేదని చెప్పారు. అయితే, వీరిలో ఏజ్ అయిపోయినవాళ్లు, ఉద్యోగాలు వచ్చిన వాళ్లూ ఉన్నారని వివరించారు. రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా ఉద్యోగులకు దాదాపు 7 లక్షల మంది మాత్రమే వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కాగా, కమిషన్ పై పనిగట్టుకొని దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని చైర్మన్ హెచ్చరించారు. గతంలో లాగా సైలెంట్‌‌‌‌గా ఉండటం కుదరదని, ఇక లీగల్‌‌‌‌గా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే జైలుకు పంపిస్తామని, పరువు నష్టం దావాలు వేస్తామని హెచ్చరించారు.  


20 పోస్టులకు 19 వేల అప్లికేషన్లు 


ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ)లో 20 అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే.. 19 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని బుర్రా వెంకటేశం తెలిపారు. అంటే 0.1 శాతం మందికి మాత్రమే ఉద్యోగం వస్తుందని చెప్పారు. మిగిలిన 99.9 శాతం మందికి సహజంగానే అసంతృప్తి ఉంటుందని, దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇకపై ప్రతి రెండు, మూడు నెలలకోసారి ప్రెస్ మీట్ పెట్టి కమిషన్ వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు చంద్రకాంత్‌‌‌‌రెడ్డి, అమీర్ ఉల్లా ఖాన్, విశ్వప్రసాద్, లక్ష్మీకాంత్​ రాథోడ్,సెక్రెటరీ హరిత పాల్గొన్నారు.