ఆర్టీసీ విలీనానికి కట్టుబడి ఉన్నాం.. త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తాం.. తరువాత విలీనం పూర్తి చేస్తాం

ఆర్టీసీ విలీనానికి కట్టుబడి ఉన్నాం.. త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తాం.. తరువాత విలీనం  పూర్తి చేస్తాం
  • మంత్రి పొన్నం ప్రభాకర్ 

పెద్దపల్లి, వెలుగు : ఆర్టీసీ విలీన ప్రక్రియకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించి, ఎన్నికైన వారితో చర్చించి విలీనం ప్రక్రియను చేపడుతామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ చెప్పారు. ఆర్టీసీ విలీనంపై కార్మికులు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు.

 గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆదివారం మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు, ప్రభుత్వ విప్,  పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి పెద్దపల్లిలో నిర్మాణం అవుతున్న బస్‌‌‌‌ డిపో పనులను పరిశీలించారు. అలాగే మంథని బస్టాండ్‌‌‌‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

 ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ మాట్లాడుతూ గ్రామాలకు బస్‌‌‌‌ సౌకర్యం కల్పించడం కోసమే పెద్దపల్లిలో డిపో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం ప్రభుత్వం కేబినెట్‌‌‌‌ సబ్‌‌‌‌కమిటీని నియమించిందని, కుంభమేళాను తలపించే స్థాయిలో పుష్కరాలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్‌‌‌‌ చైర్మన్లు నూగిళ్ల మల్లయ్య, శ్రీనివాస్‌‌‌‌ పాల్గొన్నారు.