V6 News

ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్య సంపద పెరిగింది

ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్య సంపద పెరిగింది

హైదరాబాద్‌‌, వెలుగు: వ‌‌చ్చే నెల‌‌ మొదటి వారంలో ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ యాద‌‌వ్‌‌ తెలిపారు. మంగ‌‌ళ‌‌వారం మాసాబ్ ట్యాంక్‌‌లోని మత్స్యశాఖ ఆఫీసు నుంచి ఆయ‌‌న‌‌, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ యేడు 26,778 నీటి వనరుల్లో రూ. 88.53 కోట్లతో 68 కోట్ల చేప పిల్లలు... రూ.24.50 కోట్లతో 275 నీటి వనరుల్లో 10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేస్తామ‌‌ని మంత్రి చెప్పారు. సంబంధించిన అన్ని ఏర్పాట్లను సెప్టెంబర్ ఫస్ట్‌‌ వీక్‌‌ వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

చేప పిల్లల విడుదల ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు తప్పనిసరిగా వీడియో తీయాలన్నారు. రోజూ ఎన్ని చేప, రొయ్య పిల్లలను.. ఎన్ని నీటి వనరుల్లో విడుదల చేశారో వివరాలను టీ మత్స్య పోర్టల్ లో నమోదు చేయాలని వెల్లడించారు. చేప పిల్లల లెక్కింపునకు అవసరమైన మిషన్ లను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ లచ్చిరాం బూక్యా ను మంత్రి ఆదేశించారు. ఇప్పటి వరకు 26 వేల నీటి వనరులను జియో ట్యాగింగ్ చేశామని తెలిపారు.  ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో రాష్ట్రంలో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందన్నారు.