V6 News

నిర్మల్ జిల్లా భైంసాలో విషాదం.. ఆపరేషన్ చేస్తుండగా డాక్టర్కు గుండెపోటు.. ప్రాణం పోయింది !

నిర్మల్ జిల్లా భైంసాలో విషాదం.. ఆపరేషన్ చేస్తుండగా డాక్టర్కు గుండెపోటు.. ప్రాణం పోయింది !

నిర్మల్: ప్రాణాలు నిలిపే వైద్యులు కూడా గుండెపోటు బాధితులుగా మిగిలిపోతున్నారు. ఒక పేషెంట్కు ఆపరేషన్ చేస్తుండగా.. నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన డాక్టర్ సురేందర్కు గుండెపోటు వచ్చింది. నర్సాపూర్ (జి) మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఆయన భైంసాలో ప్రైవేటు ఆసుపత్రి నడుపుతున్నాడు.

ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం తన ప్రైవేటు ఆసుపత్రిలో ఓ పేషంట్కు ఆపరేషన్ చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. సిబ్బంది గమనించి నిర్మల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన గుండెపోటుపై ఉన్న భయాలను మరింత పెంచింది.

గుండెపోటును మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అని పిలుస్తారు. గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువ ఉంటుంది. అందువల్ల ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్లు ఉండడం, ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగొచ్చు. ఇలాంటి వ్యక్తులకు అవసరాలను బట్టి బైపాస్‌ సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ చేస్తారు.

సాధారణంగా ఇది గుండె కండరాలకు తీసుకు వెళ్లే కరోనరీ ధమనులు మూసుకుపోయినపుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల గుండెకు రక్త సరఫరా ఆగిపోతుంది. గుండె కండరానికి (కార్డియాక్​ మజిల్) రక్త ప్రసరణ చేసే రక్తనాళాలనే కరోనరీ ధమనులు అంటారు. ఈ కరోనరీ ధమనులలో బ్లాకులు ఏర్పడినప్పుడు హార్ట్​అటాక్​ వస్తుంది. బ్లాకులు ఏర్పడినప్పుడు గుండెకు ఆక్సిజన్​ నిండిన రక్తం అందదు. ఆ బ్లాకులు త్వరగా తెరుచుకోకపోతే మనిషి చనిపోతాడు.