- అన్ని రాష్ట్రాలకు కలిపి
- రూ.1, 09, 019 కోట్లు రిలీజ్
- ఏపీకి రూ. 4,597 కోట్లు
- అత్యధికంగా యూపీకి
- రూ.19, 208 కోట్లు
- బిహార్‌కు రూ.10, 845 కోట్లు,
- మధ్యప్రదేశ్‌కు రూ.7,866 కోట్లు
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా కింద ముందస్తు(అదనపు) విడతగా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలకు రూ. 1,09,019 కోట్లను రిలీజ్ చేసింది. ఇందులో తెలంగాణకు రూ.2,370 కోట్లును కేటాయించింది. ఆగస్ట్ 10న విడుదల చేయనున్న సాధారణ నెలవారీ పన్నుల కేటాయింపులకు అదనంగా ఈ నిధులు విడుదల చేసినట్లు తెలిపింది.
రాష్ట్రాల మూలధన, అభివృద్ధి వ్యయాలను వేగవంతం చేసేందుకు వాటి ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయాలన్న నిబద్ధతతో ఈ నిధుల విడుదల జరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ శనివారం ఒక ప్రటకనలో పేర్కొంది. పండుగ సీజన్ ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమ సంబంధిత ఖర్చులకు నిధులు సమకూర్చుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
అత్యధికంగా యూపీకి కేటాయిపులు
తాజా నిధుల్లో సింహభాగం యూపీకి దక్కింది. ఉత్తర ప్రదేశ్ కు అత్యధికంగా రూ. 19, 208 కోట్లును కేంద్రం రిలీజ్ చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో బిహార్ (రూ. 10, 845 కోట్లు), మధ్య ప్రదేశ్ (రూ. 8, 010 కోట్లు), వెస్ట్ బెంగాల్ (రూ.7,866 కోట్లు), మహారాష్ట్ర (రూ.7, 022 కోట్లు), రాజస్థాన్ (రూ.6,460 కోట్లు) ఉన్నాయి. పక్క రాష్ట్రమైన ఏపీకి రూ.4,597 కోట్లను కేంద్రం కేటాయించింది. ఒడిశాకు రూ.4, 819 కోట్లు, తమిళనాడుకు రూ. 4,466 కోట్లు, కర్నాటకకు రూ.4,504 కోట్లు, జార్ఖండ్ కు రూ.3,660 కోట్లతో తెలంగాణ కన్నా ఎక్కువ నిధులు పొందిన రాష్ట్రాల వరుసలో నిలిచాయి.
