- ఏఐబీపీ ఫేజ్2 కింద 29 ప్రాజెక్టులకు ప్రతిపాదనలిచ్చిన రాష్ట్రం
- చిన్న కాళేశ్వరం, మోడికుంటవాగు, చనాక కొరాటకు రూ.868 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తులు
- కేంద్ర బడ్జెట్‌లో పైసా విదల్చని బీజేపీ సర్కార్
- మంత్రి ఉత్తమ్ లేఖ రాస్తే పట్టించుకోని ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్రం చిన్నచూపు చూస్తున్నది. మన ప్రాజెక్టులకు అనుమతుల దగ్గర నుంచి.. నిధుల వరకు వివక్ష చూపిస్తున్నది. ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ రాసిన లేఖ అందుకు ఉదాహరణ కాగా.. ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన (పీఎంకేఎస్‌వై)లో భాగమైన యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్(ఏఐబీపీ) కింద రాష్ట్రానికి ఇచ్చే నిధుల్లో పైసా ఇవ్వకపోవడం అందుకు మరో ఉదాహరణ.
ఏఐబీపీ కింద రాష్ట్రంలోని ప్రాజెక్టులకు నిధులివ్వాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరినా. తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నది. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి ఏఐబీపీ కింద కేంద్రం పైసా ఇవ్వకపోవడం గమనార్హం.
విజ్ఞప్తులకు స్పందన కరువు..
ఏఐబీపీ ఫేజ్2 కింద రాష్ట్రంలోని 29 ప్రాజెక్టులకు నిధులివ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జనవరిలోనే విజ్ఞప్తి చేసింది. అందులో దేవాదుల, ఇందిరమ్మ వరద కాల్వ, రాజీవ్ భీమా, ఎస్సారెస్పీ స్టేజ్2, నీలం, పాల్వాయి వాగులు, సీతారామ సీతమ్మసాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్, మోడికుంట వాగు, చిన్నకాళేశ్వరం, చనాక కొరాట బ్యారేజీ సహా 29 ప్రాజెక్టులను అందులో చేర్చింది. ముఖ్యంగా మూడు ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కేంద్రానికి నిరుడు కోరింది.
ములుగు జిల్లాలోని మోడికుంటవాగు ప్రాజెక్టుకు రూ.463 కోట్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.233 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాలోని చనాక కొరాట బ్యారేజీ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ కోసం రూ.172 కోట్లతో ప్రతిపాదనలను పంపింది. ఆ మూడు ప్రాజెక్టులకు కలిపి రూ.868 కోట్ల నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. వాటిని సెంట్రల్ వాటర్ కమిషన్ పరిశీలించి, చిన్నకాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.233 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే, తీరా ఇప్పుడు ఒక్క పైసా కూడా ఆయా ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలేదు.
అన్ని అనుమతులున్నా..
ఏఐబీపీ కింద ప్రతిపాదించిన అన్ని ప్రాజెక్టులకూ కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయి. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ఆమోదాలూ లభించాయి. కానీ, కేంద్రం మాత్రం మన ప్రాజెక్టులపై శీత కన్నేసింది. నిరుడు రాసిన లేఖకు కొనసాగింపుగా.. ఈ నెలలోనూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి సీఆర్‌పాటిల్‌కు లేఖ రాయగా, ఇప్పుడే నిధులు ఇవ్వలేమన్నట్టుగా ఆయన సమాధానమిచ్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఒకానొక దశలో ఏఐబీపీ కింద చేర్చే ప్రతిపాదనలుండగా.. అసలు ఆ ప్రాజెక్టు డీపీఆర్‌కే క్లియరెన్సులు ఇప్పుడు ఇవ్వబోమంటూ ఆ లేఖలో కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు.
ఏఐబీపీలో చేర్చిన చిన్న కాళేశ్వరం, చనాక కొరాట, ఇంటిగ్రేటెడ్ సీతారామ సీతమ్మసాగర్ ప్రాజెక్టులను సీడబ్ల్యూసీ పరిశీలించిందని, వాటి ఫైళ్లను మళ్లీ రాష్ట్రానికి పంపిందని ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం. ఈ లెక్కన చిన్నకాళేశ్వరం ప్రాజెక్టుకు ఇస్తామన్న నిధులనూ ఇవ్వకుండా కేంద్రం చేతులెత్తేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏపీకి దండిగా నిధులు..
మనకు నిధులిచ్చేందుకు చేతులెత్తేస్తున్న కేంద్రం.. ఏపీకి మాత్రం అడిగిందే తడవుగా నిధులు మంజూరు చేస్తున్నది. పీఎంకేఎస్‌వై కింద ఐదేండ్లలో ఆ రాష్ట్రానికి రూ.1,326 కోట్లను విడుదల చేసింది. అయితే, ఏఐబీపీ కింద ఏపీ ఎలాంటి దరఖాస్తులు పెట్టుకోకపోవడంతో.. దాని కింద నిధులను మంజూరు చేయలేదు. కానీ, అదే పీఎంకేఎస్‌వైలో భాగమైన వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపొనెంట్(డబ్ల్యూడీసీ), పర్ డ్రాప్ మోర్ క్రాప్ (పీడీఎంసీ) కింద ఆ నిధులను విడుదల చేసింది.
పీడీఎంసీ కింద రూ.946.42 కోట్ల నిధులను ఇచ్చింది. అదే డబ్ల్యూడీసీ కింద 13 జిల్లాల్లోని 59 ప్రాజెక్టులకు రూ.380.76 కోట్ల ఫండ్స్‌ను మంజూరు చేసింది. హర్ ఖేత్ కో పానీ (హెచ్కేకేపీ), రిపేర్ రెనోవేషన్ రీస్టోరేషన్ (ఆర్‌ఆర్‌ఆర్) కింద మరో రూ.42.432 కోట్లను కేంద్రం మంజూరు చేయడం గమనార్హం.
