
న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాన మంత్రి ఈ డ్రైవ్ స్కీం కింద హైదరాబాద్‌కు 2 వేల ఎలక్ట్రిక్ బస్సులను కేంద్రం కేటాయించనుంది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో కేంద్ర భారీ పరిశ్రమల, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఐదు ప్రధాన సిటీల్లో రూ.10,900 కోట్లతో 14,028 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇందులో భాగంగా బెంగళూరుకు 4,500, హైదరాబాద్‌కు 2వేలు, ఢిల్లీకి 2,800, అహ్మదాబాద్‌కు వెయ్యి, సూరత్‌కు 600 ఎలక్ట్రిక్ బస్సులను అందించనున్నట్టు ఆయన వెల్లడించారు. దేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ బస్సులను అందించనున్నట్లు వెల్లడించారు.