చెరువులను కబ్జా చేస్తుంటే మీరేం చేస్తున్నారు?

చెరువులను కబ్జా చేస్తుంటే మీరేం చేస్తున్నారు?
  • హైదరాబాద్​లోని వరద ప్రాంతాల్లో, సిద్దిపేట జిల్లాలో సెంట్రల్​ టీమ్​ పర్యటన
  • రాష్ట్రంలో రూ.10 వేల కోట్ల నష్టం జరిగిందన్న సీఎస్​

హైదరాబాద్, వెలుగుభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పినప్పటికీ ముందస్తుగా ఎందుకు అలర్ట్​ కాలేదని రాష్ట్ర అధికారులను సెంట్రల్​ టీమ్​ ప్రశ్నించింది. హైదరాబాద్​ చుట్టుపక్కల చెరువుల జాగలను కబ్జా చేస్తుంటే ఏం చేస్తున్నారని, చెరువులకు గొలుసుకట్టు ఎందుకు మిస్సయిందని నిలదీసింది. రాష్ట్రంలో వరద పరిస్థితులను తెలుసుకునేందుకు గురువారం ఐదుగురు సభ్యులతో కూడిన సెంట్రల్​ టీమ్​ హైదరాబాద్​కు వచ్చింది. ఇందులో కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ  ప్రవీణ్ వశిష్ట, జ‌‌ల‌‌వ‌‌న‌‌రుల విభాగం సూప‌‌రింటెండెంట్ ఇంజ‌‌నీర్ ఎం.ర‌‌ఘురాం, రోడ్ ట్రాన్స్‌‌పోర్ట్‌‌, హై-వేస్ సూప‌‌రింటెండెంట్ ఇంజ‌‌నీర్ ఎస్‌‌.కె.కుష్వారాతోపాటు ఆర్బీ  కౌల్ (ఫైనాన్స్​ మినిస్ట్రీ), మనోహరన్ (అగ్రికల్చర్​ మినిస్ట్రీ) ఉన్నారు. మొదట బీఆర్కే భవన్​లో సీఎస్​ సోమేశ్​కుమార్​తో సెంట్రల్‌ టీం సమావేశమైంది. అనంతరం టీమ్​లోని ముగ్గురు సభ్యులు హైదరాబాద్​లోని వరద ప్రాంతాల్లో, చెరువులకు గండ్లు పడ్డ ప్రాంతాల్లో  పర్యటించారు. పల్లె, గుర్రం, అప్పా చెరువులను పరిశీలించారు. చెరువులపై ఉన్న నిర్మాణాలను చూసి వీటికి అనుమతులు ఎవరిచ్చారని రాష్ట్ర ఆఫీసర్లను సెంట్రల్​ టీమ్​ నిలదీసింది. నిజాం కాలంలో నిర్మించిన ఈ చెరువుల గొలుసుకట్టు ఎందుకు మిస్సయిందని, ఇట్లయితే నీరంతా ఎక్కడికి పోతుందని ప్రశ్నించింది. చెరువుల వివరాలతో పాటు ఆరేండ్లలో కబ్జాలపై తీసుకున్న చర్యలపై రిపోర్టు ఇవ్వాలని ఆఫీసర్లను ఆదేశించింది.

పొంతన లేని సమాధానాలు

మిషన్​ కాకతీయ కింద చెరువులను అభివృద్ధి చేస్తున్నామని సెంట్రల్​ టీమ్​కు రాష్ట్ర ఆఫీసర్లు చెప్పారు. ‘‘అంత చేస్తే మరి ఎందకిట్ల జరిగింది?” అని సెంట్రల్​ టీమ్​ ప్రశ్నించింది. అధికారులు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో సెంట్రల్​ టీమ్​ అసహనం వ్యక్తం  చేసింది. చెరువులతో పాటు ఫలక్​నుమా, కందికల్​, హఫీజ్​ బాబానగర్ తదితర​ ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడి ఏం జరిగిందన్న విషయాలను టీమ్​ సభ్యులు తెలుసుకున్నారు. ఇప్పటికీ రోడ్లపై, ఇండ్లలోనూ నీళ్లు పేరుకుపోయి ఉన్నాయని చాంద్రాయణగుట్ట, ఫ‌‌ల‌‌క్‌‌నుమా, పూల్​బాగ్​లోని వరద బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు.  40  ఏండ్ల కింద ఫ‌‌ల‌‌క్‌‌నుమా ఆర్‌‌వోబీని నిర్మించారని, పల్లె చెరువు నుంచి వ‌‌చ్చే వ‌‌ర‌‌ద నీటి నాలా 7 మీట‌‌ర్ల  వెడ‌‌ల్పు ఉంటుంద‌‌ని, ఈ నాలా ఆర్‌‌వోబీ కింద నుంచి వెళ్తుంద‌‌ని సెంట్రల్​ టీమ్​కు జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేశ్​కుమార్, చీఫ్​ ఇంజనీర్​ జియా ఉద్దీన్​ వివరించారు. ప‌‌ల్లె చెరువు తెగిపోవ‌‌డం వ‌‌ల్ల వ‌‌చ్చిన వ‌‌ర‌‌ద‌‌తో ఈ ప్రాంతానికి భారీగా న‌‌ష్టం జ‌‌రిగిందన్నారు. పాతబస్తీలో తాజా పరిస్థితిని సెంట్రల్​ టీమ్​కు  ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ వివరించారు. టీమ్​ వెంట  జీహెచ్​ఎంసీ క‌‌మిష‌‌న‌‌ర్ డి.ఎస్‌‌.లోకేష్ కుమార్‌‌, డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్ సెక్రట‌‌రీ రాహుల్ బొజ్జా, హైద‌‌రాబాద్ జిల్లా క‌‌లెక్టర్ శ్వేత మ‌‌హంతి తదితరులు ఉన్నారు.

వర్షాలతో రూ.10 వేల కోట్ల నష్టం: సీఎస్​

భారీ వర్షాల, వరదల వల్ల రాష్ట్రంలో సుమారు రూ.10 వేల కోట్ల నష్టం వాటిల్లిందని సెంట్రల్​ టీమ్​కు  సీఎస్  సోమేశ్ కుమార్  చెప్పారు. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందన్నారు. నష్టాన్ని తగ్గించటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పంట నష్టం రూ. 8,633 కోట్లు, రోడ్లకు రూ. 222 కోట్లు, జీహెచ్​ఎంసీకి సుమారు రూ. 567 కోట్లు, విద్యుత్ శాఖకు రూ. 300 కోట్లు , ఇరిగేషన్​కు రూ. 50 కోట్లు నష్టం వాటిల్లిందని వివరించారు. వరద సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం  రూ. 550 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. బీఆర్కే భవన్​లో సెంట్రల్​ టీమ్​తో సీఎస్​, అధికారులు సమావేశమయ్యారు. వరద పరిస్థితి, నష్టం, సహాయ చర్యలను పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ద్వారా ఆఫీసర్లు వివరించారు. గత పది రోజులుగా రాష్ట్రంలోఅత్యధిక వర్షాలవల్ల హైదరాబాద్, పరిసర జిల్లాలో భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని చెప్పారు. మూసీ నదికి వరద ముంపు ఏర్పడటంతో పాటు నగరంలో మూడు చెరువులకు గండిపడటం వల్ల నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని పేర్కొన్నారు.

నేడు పలు ప్రాంతాల్లో పర్యటన

రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన సెంట్రల్​ టీమ్​ శుక్రవారం రెండో రోజు సరూర్​ నగర్, ఎల్బీనగర్​, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు తెలిసింది.

రైతులతో మాట్లాడిన సెంట్రల్​ టీమ్​

గజ్వేల్, వెలుగు: సెంట్రల్​ టీమ్​లోని ఇద్దరు సభ్యులు ఆర్బీ  కౌల్, మనోహరన్  సిద్దిపేట జిల్లా ములుగు, మర్కుక్, కొండపాక మండలాల్లో పర్యటించారు. వానలకు  దెబ్బ తిన్న పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. వర్షాల కారణంగా  జిల్లాలో 84,159 ఎకరాల్లో రూ. 423  కోట్ల మేర వివిధ పంటలకు నష్టం వాటిల్లిందని సెంట్రల్​ టీమ్​కు  జిల్లా కలెక్టర్​ వెంకట్రామారెడ్డి చెప్పారు. కోతకు వచ్చే టైంలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని,  ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు.