తెలంగాణలో రైతు భరోసా వచ్చింది .. మొత్తం 68.99 లక్షల మందికి లబ్ధి

తెలంగాణలో రైతు భరోసా వచ్చింది .. మొత్తం 68.99 లక్షల మందికి లబ్ధి
  • అన్నదాతల అకౌంట్లలో రెండో విడత డబ్బులు జమ
  • 5 ఎకరాలకుపైగా భూమి ఉన్నోళ్లకు మొదలైన సాయం 
  • 7 ఎకరాల వరకు ఉన్న రైతుల అకౌంట్లలోకి పడిన పైసలు
  • రేపటిలోగా అందరికీ అందనున్న రైతు భరోసా
  • 6.65 లక్షల మంది రైతులకు రూ.2,423 కోట్ల నిధులు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి. ఇప్పటివరకూ ఐదెకరాలలోపు రైతులకు పెట్టుబడి సాయం అందగా,  సోమవారం నుంచి ఐదెకరాలు పైబడిన రైతుల ఖాతాల్లో సాయం డబ్బులు జమ చేస్తున్నట్టు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు సోమవారం ఏడెకరాలున్న రైతుల అకౌంట్లలో డబ్బు జమైనట్టు ఫోన్లకు మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వచ్చాయి. బుధవారం లోపు 6.65 లక్షల మంది రైతులకు  రూ.2,423 కోట్ల నిధులు అందనున్నాయి. 

68.99 లక్షల మందికి రైతుభరోసా.. 

గత వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 68.99 లక్షల మంది అన్నదాతలు రైతు బంధు సాయం పొందుతున్నారు. కాంగ్రెస్​ సర్కారు వచ్చాక యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ అంతే మంది రైతులకు రైతు భరోసా ఇస్తామని పేర్కొంది.  రాష్ట్ర వ్యాప్తంగా1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.7,625 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది.

ఇప్పటివరకు ఐదెకరాలు, ఆలోపు ఉన్న 64.75 లక్షల మంది రైతులకు రూ.5,575 కోట్ల రైతుభరోసా సాయం అందించింది. తాజాగా, మిగిలిన ఐదెకరాలకు పైబడిన 4.24 లక్షల మంది రైతులకు రూ.2,050 కోట్లు వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తున్నారు. గతంలో అకౌంట్లలో సమస్య ఉండి తిరిగి వెళ్లిన 2.40 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.423 కోట్ల ఫండ్స్​ కూడా వారి అకౌంట్లలో వేస్తున్నట్టు ఆఫీసర్లు వెల్లడించారు. దీంతో ఈ దఫాలో 6.65 లక్షల మంది  రైతులకు రూ.2,423 కోట్లు నిధులు అందనున్నాయి. 
 
5 ఎకరాల లోపే 64.75 లక్షల మంది రైతులు 

రాష్ట్రవ్యాప్తంగా 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. 5 ఎకరాల లోపు ఉన్న రైతులు 64.75 లక్షల మంది ఉండగా, వీరి చేతుల్లో కోటి 11 లక్షల ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి.  24.24 లక్షల మంది రైతుల చేతిలో ఎకరం లోపే భూములున్నాయి. వీరి చేతుల్లో ఉన్న భూములు కేవలం 13.57 లక్షల ఎకరాలు మాత్రమే. ఇక ఎకరా నుంచి రెండెకరాల వరకున్న రైతులు 17.72 లక్షల మంది కాగా, వారి చేతిలో ఉన్న భూమి 26.58 లక్షల ఎకరాలు. 

రెండెకరాల నుంచి మూడెకరాల లోపున్న రైతులు 11.30 లక్షల మంది ఉండగా, వారికి అత్యధికంగా 27.36 లక్షల ఎకరాల భూమి ఉంది. ఇక మూడెకరాల నుంచి నాలుగెకరాల లోపున్న రైతులు 6.54 లక్షల మంది ఉండగా, వారి చేతిలో 22.93 లక్షల ఎకరాల భూమి ఉంది. ఇక నాలుగెకరాల నుంచి ఐదెకరాల లోపున్న రైతులు 4.92 లక్షల మంది ఉండగా.. వారికి 21.03 లక్షల ఎకరాల భూమి ఉన్నట్టు వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి.