కవితకు నో బెయిల్ .. సీబీఐ, ఈడీ కేసుల్లో మరోసారి నిరాశ

కవితకు నో బెయిల్ .. సీబీఐ, ఈడీ కేసుల్లో మరోసారి నిరాశ
  • బెయిల్​ ఇస్తే ఆధారాలు తారుమారు చేస్తారన్న దర్యాప్తు సంస్థలుఏకీభవించి తీర్పు వెలువరించిన సీబీఐ స్పెషల్ కోర్టు
  • వైఎస్​ జగన్​ కేసులోని అంశాలు తీర్పులో ప్రస్తావన
  • నేడు కోర్టు ముందుకు కవిత

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ విషయంలో మరోసారి నిరాశే ఎదురైంది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్​ కోర్టు నిరాకరించింది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జడ్జి కావేరి బవేజా తీర్పును వెలువరించారు.  బెయిల్ ఇవ్వడానికి గల మెరిట్స్ ఏమీ లేవని పేర్కొన్నారు. వైఎస్ జగన్​కు సంబంధించిన  ఆర్థిక నేరాల కేసులో అప్పట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ఈ తీర్పులో జడ్జి ప్రస్తావించారు. కేసు దర్యాప్తు దశలో ఉన్నందున కవితకు బెయిల్ ఇవ్వలేమని తేల్చిచెప్పారు. 

లిక్కర్​ స్కామ్​లో కవిత కింగ్​ పిన్

కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఇప్పుడు బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్షాలను కవిత తారుమారు చేసే అవకాశం ఉందని వాదనల సందర్భంగా దర్యాప్తు సంస్థలు కోర్టు దృష్టికి తెచ్చాయి. ఈ వాదనలతో ఏకీభవిస్తున్నట్లు తీర్పులో కోర్టు పేర్కొంది. కవిత దాఖలు చేసిన రెండు వేర్వేరు బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లు వెల్లడించింది. లిక్కర్ స్కామ్​లో కవిత కింగ్ పిన్  అంటూ దర్యాప్తు సంస్థలు చేసిన వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆధారాలను కవిత ధ్వంసం చేశారన్న, మొబైల్ డేటా డిలీట్ చేశారన్న, సాక్షులను బెదిరించారన్న దర్యాప్తు సంస్థల  వాదనలను తోసిపుచ్చలేమని కోర్టు పేర్కొంది. కవిత ప్రస్తావించిన అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. 

ప్రచారంలో పాల్గొనేందుకు బెయిల్  కోరగా..!

ఢిల్లీ లిక్కర్ స్కామ్​ మనీలాండరింగ్ కేసులో మార్చి 26 న కవితకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అదే రోజు ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే సీబీఐ కేసులో ఏప్రిల్ 15న 664 పేజీలతో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్లపై కవిత తరఫున సీనియర్ అడ్వకేట్లు అభిషేక్ మను సింఘ్వీ, విక్రమ్ చౌదరి, నితేశ్ రాణా, మోహిత్ రావు వాదనలు వినిపించారు.

 గత నెల 22 న సీబీఐ కేసులో వాదనలు ముగిశాయి. సీబీఐ కేసులో అభిషేక్ మనుసింఘ్వి వాదిస్తూ... బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ గా కవితను ప్రకటించారని తెలుసుకొని సీబీఐ అరెస్ట్ చేసిందని అన్నారు. కవితను టెర్రరిస్ట్ గా, కరుడుగట్టిన నేరస్థురాలిగా ట్రీట్ చేస్తున్నారని వాదించారు. ఆమె అనారోగ్య కారణాలను పరిగణనలోకి తీసుకొని కూడా బెయిల్ ఇవ్వాలన్నారు. ఇరువైపు వాదనలు ముగించిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మనీలాండరింగ్ కేసులో... గత నెల 22, 23, 24 తేదీల్లో ఈడీ తరఫు సీనియర్ అడ్వకేట్ జోహెడ్ హుస్సేన్ మూడు రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు కొనసాగించారు.

 లిక్కర్ స్కామ్​ ప్రీప్లాన్డ్ గా జరిగిందని, కవితకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఇండో స్పిరిట్ లో కవిత మేనల్లుడు మేకా శ్రీ శరణ్​ ఉద్యోగం, లక్ష జీతం తో పాటు ఇతర అంశాలను ప్రస్తావించారు. కవితను నిబంధనల మేరకే అరెస్ట్ చేశామని పేర్కొంటూ గత నెల 24న ఈడీ వాదనలను ముగించారు. కవిత తరపున 4 పేజీల రిజాయిండర్ దాఖలు చేసేందుకు అనుమతించిన కోర్టు.. తీర్పును మే 6కు (సోమవారానికి) రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.

 లోక్​సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కేవలం ఒక రోజు ముందు తనను  అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని, 2009 నుంచి బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నానని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బెయిల్​ ఇవ్వాలని రిజాయిండర్​లో కవిత పేర్కొన్నారు. అయితే ఈడీ, సీబీఐ వాదనలతో ఏకీభవించిన జడ్జి..  రెండు కేసుల్లో కవితకు బెయిల్ నిరాకరిస్తున్నట్లు తీర్పు వెలువరించారు. కాగా, బెయిల్​ పిటిషన్లను సీబీఐ కోర్టు (ట్రయల్​ కోర్టు) తిరస్కరించడంతో కవిత హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తున్నది.  

నేరుగా కోర్టుకు హాజరయ్యేందుకు ఓకే

కోర్టు ముందు నేరుగా హాజరయ్యేందుకు అనుమతించాలన్న పిటిషన్ పై కవితకు ఊరట దక్కింది. గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. దీంతో ఆమెను మంగళవారం కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అయితే గత నెల 26న విచారణ సందర్భంగా తీహార్ జైలు సిబ్బంది ఆమెను వర్చువల్ మోడ్ లో జడ్జి ముందు హాజరుపరిచారు. ఈసారి నేరుగా కోర్టు ముందు హాజరయ్యేందుకు అనుమతించాలని శుక్రవారం కవిత  కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరిపిన స్పెషల్ జడ్జి ఓకే చెప్పారు.