కార్పొరేట్ కంపెనీ పైశాచికత్వం.. జాబ్‌లో చేరిన నెలరోజులకే టెర్మినేషన్.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్!

కార్పొరేట్ కంపెనీ పైశాచికత్వం.. జాబ్‌లో చేరిన నెలరోజులకే టెర్మినేషన్.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్!

కార్పొరేట్ కంపెనీల్లో జాబ్ అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఐదంకెల జీతాలు, విలాసవంతమైన జీవితాలు, పెద్ద పెద్ద హోదాలు.. బయటకు కనిపించే ఈ మెరుపుల వెనుక ఎంతటి చీకటి దాగి ఉందో చాటిచెప్పేలా ఢిల్లీకి చెందిన ఒక వ్యాపారవేత్త పంచుకున్న రియల్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కార్పొరేట్ కంపెనీలకు ఉద్యోగులు కేవలం ఒక నంబర్ మాత్రమేనని, లాభాలు లేనప్పుడు ఎంతటి సీనియర్నైనా క్షణాల్లో రోడ్డున పడేస్తారనే చేదు నిజాన్ని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

గౌరవ్ కవాత్రా అనే వ్యక్తి 2018లో ఒక చైనీస్ మల్టీనేషనల్ కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేసేవారు. అప్పుడు ఆయన వయసు 37 ఏళ్లు. నెలకు రూ.5 లక్షల భారీ జీతం. అంతా సజావుగా సాగుతుందనుకున్న సమయంలో ఆయన జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. పర్ఫార్మెన్స్ బాగోలేదనే సాకుతో కేవలం మూడు రోజుల నోటీస్ పీరియడ్‌తో కంపెనీ ఆయనను వెంటనే ఉద్యోగం నుంచి పీకేసింది. పైగా ఎలాంటి సెవెరెన్స్ ప్యాకేజీ కూడా ఇవ్వలేదు. రూ.5 లక్షల జీతం, రూ. 2 కోట్ల హోమ్ లోన్ ఉన్న టైమ్‌లో.. చేతిలో టెర్మినేషన్ లెటర్ పెట్టారని, అది ఒంటిపై బట్టలు లేకుండా నగ్నంగా రోడ్డుపై నిలబెట్టినట్లు అనిపించిందని గౌరవ్ ఆనాటి కార్పొరేట్ క్రూరత్వాన్ని గుర్తుచేసుకున్నారు.

ఉద్యోగం పోయాక గౌరవ్ తీవ్రమైన ఆర్థిక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సమాజం ముందు తలదించుకోవాల్సి వచ్చింది. నెలకు 108 కోల్డ్ కాల్స్ చేస్తే.. 108 రిజెక్షన్లు ఎదురయ్యాయి. తెల్లవారుజామున 3 గంటలకు పానిక్ అటాక్స్ రావడం, ఒత్తిడి తట్టుకోలేక రాత్రికి 12 నుంచి 15 సిగరెట్లు తాగడం లాంటి పరిస్థితుల్లోకి అతను వెళ్ళిపోయారు. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే పొరుగువారు వింతగా చూసేవారని, కూతురు అడిగిన ప్రశ్నలకు తన దగ్గర సమాధానం లేదని అప్పటి పరిస్థితులను గౌరవ్ గుర్తుచేసుకున్నారు. తాను పూర్తిగా సమాధి అయిపోయానని అనుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

కార్పొరేట్ లోగోలకు, పెద్ద పెద్ద డిగ్రీలకు బానిసలుగా మారొద్దని గౌరవ్ ఈ అనుభవంతో యువతను హెచ్చరిస్తున్నారు. డిగ్రీల కాలపరిమితి ముగిసిపోతుందని, కానీ మన నైపుణ్యాలు మాత్రమే ఎప్పటికీ తోడుంటాయని ఆయన గ్రహించారు. ఆ ఘోర పరాజయం తర్వాత ఆయన సేల్స్, మార్కెటింగ్, పీపుల్ మేనేజ్‌మెంట్‌లో నైపుణ్యం సాధించి, సొంతంగా కన్సల్టింగ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు అడుగులు వేశారు.

నేడు గౌరవ్ రూ.6వేల 500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు సలహాదారుడిగా.. అలాగే 19 రాష్ట్రాల్లోని కార్పొరేట్ సంస్థలతో కలిసి పనిచేస్తూ సగర్వంగా నిలబడ్డారు. కార్పొరేట్ తొలగింపు తన ముగింపు కాదని, అది తన పునర్జన్మ అని పేర్కొన్నారు. ఉద్యోగంలో ఎదురుదెబ్బ తగిలితే ప్రాణాలు తీసుకోవద్దని, భార్యతో, తల్లితో మాట్లాడి బాధను పంచుకోవాలని గౌరవ్ చెబుతున్నారు. డబ్బును తిరిగి సంపాదించవచ్చని కానీ ఆరోగ్యాన్ని కాదని నేటి కార్పొరేట్ జాబ్ బాధితులకు సూచిస్తున్నారు.