అడవిలో దొరికిన ఎముకలు శ్రద్ధ వాకర్​వే

అడవిలో దొరికిన ఎముకలు శ్రద్ధ వాకర్​వే

న్యూఢిల్లీ: అడవిలో దొరికిన ఎముకలు శ్రద్ధ వాకర్​వేనని డీఎన్ఏ రిపోర్టులో వెల్లడైంది. ఈ రిపోర్టును ఢిల్లీ పోలీసులకు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ అందజేసింది. ‘‘శ్రద్ధ వాకర్‌‌ కేసులో ఢిల్లీకి దగ్గర్లోని మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో 13 ఎముకలు స్వాధీనం చేసుకున్నం. ఆ ఎముకల డీఎన్ఏను శ్రద్ధ తండ్రి డీఎన్ఏ శాంపిల్స్ తో పోల్చి చూశాం. రిజల్ట్ పాజిటివ్ గా వచ్చింది. ఆ ఎముకలు శ్రద్ధ వాకర్ వేనని తేలింది” అని పోలీస్ వర్గాలు గురువారం తెలిపాయి. అలాగే నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా పాలీగ్రాఫ్ టెస్టు రిపోర్టును కూడా ఢిల్లీ పోలీసులకు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ అందజేసింది.

శ్రద్ధను ఆమె పార్టనర్ అఫ్తాబ్ చంపేసి బాడీని 35 ముక్కలు చేసి  ఆ బాడీ పార్ట్స్ ను ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పడేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 12న అఫ్తాబ్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కాగా, శ్రద్ధ వాకర్ కేసులో ఢిల్లీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు ఇద్దరు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించారు. ఇద్దరు స్పెషల్ పీపీలు కావాలని కోరుతూ పోలీసులు పంపిన ఫైల్ కు ఆయన ఆమోదం తెలిపారు. మధుకర్ పాండే, అమిత్ ప్రసాద్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా ట్రయల్ కోర్టులో ఢిల్లీ పోలీసుల తరఫున వాదనలు వినిపిస్తారు.