
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 7 శాతం వృద్ధి చెందుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 8.7 శాతం పెరిగింది. నామినల్ జీడీపీ గ్రోత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15.4 శాతం పెరుగుతుందని స్టాటిస్టిక్స్ మినిస్ట్రీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. 2021–22 లో దేశ నామినల్ జీడీపీ గ్రోత్ 19.5 శాతం నమోదయ్యింది. కాగా, నామినల్ జీడీపీని లెక్కించేటప్పుడు ఇన్‌ఫ్లేషన్ ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోరు. గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ) అంచనాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. కిందటి ఆర్థిక సంవత్సరంలో 8.1 శాతం పెరిగిన జీవీఏ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతం వృద్ధి చెందుతుందని లెక్కించింది. ‘రియల్ జీడీపీ లేదా స్థిరమైన ధరల (2011–22) వద్ద జీడీపీ 2022–23 లో రూ. 157.60 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనావేస్తున్నాం. 2021–22 లో జీడీపీ రూ.147.36 లక్షల కోట్లుగా నమోదయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రియల్ జీడీపీ గ్రోత్ 7 శాతంగా ఉంటుందని అంచనా’ అని స్టాటిస్టిక్స్ మినిస్ట్రీ వెల్లడించింది.
ఈ లెక్కల ఆధారంగానే బడ్జెట్‌లో రెవెన్యూ అంచనాలు
జీవీఏ లెక్కలు చూస్తే, సర్వీస్ సెక్టార్ గ్రోత్ 13.7 % దగ్గర రికార్డ్ లెవెల్‌కు చేరుకుంటుందని ప్రభుత్వం అంచనావేస్తోంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో ఈ సెక్టార్ గ్రోత్ 11.1 శాతంగా నమోదయ్యింది. మరోవైపు మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ ఉత్పాదకత కిందటి ఆర్థిక సంవత్సరంలో 9.9 శాతంగా నమోదు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.6 శాతానికి పడిపోతుందని వెల్లడించింది. ప్రజల వినియోగం 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7.7 శాతం పెరుగుతుందని వివరించింది. పెర్ క్యాపిటా జీడీపీ 5.8% వృద్ధి చెందుతుందని అంచనావేసింది. ఫిబ్రవరి 1 న కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. దీని కంటే ముందే ఎకానమీకి సంబంధించిన అంచనాలను ప్రకటించింది. ఈ అంచనాలకు అనుగుణంగా 2023–24 ఆర్థిక సంవస్థరంలో ట్యాక్స్ రెవెన్యూ ఎంత వస్తుందనేది ఆర్థిక మంత్రి లెక్కిస్తారు. ఇతర అంచనాలనూ వీటిపై ఆధారపడే వేస్తారు. కాగా, ప్రభుత్వం విడుదల చేసిన జీడీపీ గ్రోత్ అంచనా ఆర్‌బీఐ వేసిన అంచనా కంటే ఎక్కువగా ఉంది. 2022–23 లో జీడీపీ గ్రోత్ 6.8 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనావేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ గ్రోత్ 7.2 శాతంగా ఉంటుందని కిందటేడాది ఏప్రిల్‌లో అంచనావేసిన ఈ సంస్థ, సెప్టెంబర్‌లో తన అంచనాలను 7 శాతానికి, ఆ తర్వాత 6.8 శాతానికి తగ్గించింది.